పూతలపట్టు: పూతలపట్టు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులపై వైసీపీ నేతలు పెట్టిన రెండు కేసులను చిత్తూరు జిల్లా న్యాయస్థానం గురువారం కొట్టివేసింది. నేరం రుజువు కాలేదన్న కారణంతో మూడవ అదనపు న్యాయమూర్తి ఈ నిర్ణయం తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ 2021 సెప్టెంబర్ నెలలో పూతలపట్టు మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ ధర్నాను మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దొరబాబు చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ ధర్నా నేపథ్యంలో వైసీపీ నేతల ఫిర్యాదుపై దొరబాబు చౌదరి సహా మరో 21 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ధర్నా సందర్భంగా చట్టం ఉల్లంఘించారనే ఆరోపణలపై నమోదు చేసిన ఈ కేసును చిత్తూరు జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న మూడవ కోర్టు గురువారం విచారించింది.

కేసు విచారణ సందర్భంగా పూర్వపరాలు, సాక్ష్యాలను పరిశీలించిన న్యాయమూర్తి, ఆరోపణలకు సంబంధించి నేరం రుజువు కాలేదని తేల్చారు. దీంతో దొరబాబు చౌదరి సహా 22 మందిపై నమోదైన కేసును కోర్టు కొట్టివేసింది.

ఇదిలా ఉండగా, 2021 అక్టోబర్ నెలలో పూతలపట్టు మండలంలోని అయ్యప్ప గారి పల్లి గ్రామంలో టిడిపి నేతలు వైయస్ జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను శవయాత్ర రూపంలో ఊరేగించారు. ఈ ఘటనపై వైసీపీ నేతల ప్రోత్సాహంతో 11 మంది టిడిపి నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

దిష్టిబొమ్మ శవయాత్ర కేసు కూడా గురువారం చిత్తూరు జిల్లా మూడవ కోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసులోనూ పూర్వపరాలు, సాక్ష్యాలను పరిశీలించిన అనంతరం ఆరోపణలకు మద్దతుగా సరిపడిన ఆధారాలు లేవని న్యాయస్థానం గుర్తించింది. ఫలితంగా ఈ కేసును కూడా న్యాయమూర్తి కొట్టివేశారు.

పూతలపట్టు మండల టిడిపి నేతలపై నమోదైన ఈ రెండు కేసుల్లో వాదనలను ఏపీపి ఉమాదేవి కోర్టులో వినిపించారు. న్యాయస్థానం తీర్పులతో టిడిపి శ్రేణుల్లో ఉపశమనం నెలకొంది.