రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్:
ఇండోనేసియాకు భారత ‘బ్రహ్మాస్త్రం’ బ్రహ్మోస్..
మోదీ పర్యటనలో కీలక రక్షణ ఒప్పందం
భారత్ రూపొందించిన సూపర్ సోనిక్ క్షిపణి బ్రహ్మోస్ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో పాకిస్థాన్‌పై వినియోగించి తన సామర్థ్యాన్ని నిరూపించిన ఈ క్షిపణి కొనుగోలుకు ఇప్పుడు ఇండోనేసియా ముందుకొచ్చింది. మూడు దేశాల పర్యటనలో భాగంగా జకార్తాలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ సందర్శన సందర్భంగా ఇరు దేశాల మధ్య ఈ కీలక రక్షణ ఒప్పందం కుదిరింది.
మంగళవారం జకార్తాలో ప్రధాని మోదీ, ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సమావేశం అనంతరం రక్షణతో పాటు పలు రంగాల్లో సహకారం పెంచుకునేందుకు ఇరు దేశాలు అనేక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. క్రిటికల్ మినరల్స్, టెక్నాలజీ, ఆహార భద్రత, సముద్ర జలాల భద్రత, ఔషధాలు, మిలిటరీ రంగాల్లో పరస్పర సహకారం కోసం ఈ ఒప్పందాలు కుదిరాయి.
ఇండోనేసియా సైన్యానికి బ్రహ్మోస్ క్షిపణులను సరఫరా చేయడానికి భారత్ అంగీకరించింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో జకార్తా భద్రతా సామర్థ్యాన్ని పెంచడంలో ఈ క్షిపణులు కీలక పాత్ర పోషించనున్నాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి. అధిక వేగం, ఖచ్చితత్వం, లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం కారణంగా బ్రహ్మోస్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన సూపర్ సోనిక్ క్షిపణులలో ఒకటిగా గుర్తింపు పొందింది.
బ్రహ్మోస్‌తో పాటు భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఎయిర్ టు ఎయిర్ ‘అస్త్ర’ క్షిపణులను కూడా ఇండోనేసియా దిగుమతి చేసుకోనుంది. ‘సిందూర్’ ఆపరేషన్‌లో ఈ క్షిపణుల పనితీరును పరిశీలించిన అనంతరం వీటి కొనుగోలుపై జకార్తా ఆసక్తి చూపినట్లు అధికార సమాచారం.
కీలక ఖనిజాల సరఫరా గొలుసును బలోపేతం చేయడంపై కూడా ఇరు దేశాలు దృష్టి సారించాయి. ఇండోనేసియాలో స్టీల్, నికెల్, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ తయారీ రంగాల్లో భారత్ పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. ఈ పెట్టుబడులు క్రిటికల్ మినరల్స్ రంగంలో ఇరు దేశాల ఆర్థిక సంబంధాలను మరింత బలపరచనున్నాయి.
సముద్ర వ్యూహాత్మక రంగంలో భాగంగా ఇండోనేసియాలోని సబాంగ్ పోర్ట్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి భారత్, ఇండోనేసియా అంగీకరించాయి. మలక్కా జలసంధికి సమీపంలో ఉన్న ఈ పోర్ట్ భారత్‌కు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర రవాణా, భద్రతా వ్యవస్థల బలోపేతానికి ఇది దోహదం చేయనుంది.
ఇండోనేసియా ఎన్నికల వ్యవస్థకు సంబంధించి కూడా భారత్ సాంకేతిక సహకారం అందించనుంది. ఆ దేశ అవసరాల కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల తయారీకి భారత్ సాంకేతిక సాయం అందించేందుకు అంగీకరించింది. ఈ ఒప్పందాలన్నీ కలిపి చూస్తే రక్షణ, ఆర్థిక, సాంకేతిక రంగాల్లో భారత్–ఇండోనేసియా సంబంధాలు కొత్త దశలోకి అడుగుపెట్టినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.







