వియత్నాంలో భారతీయుల పర్యాటక బోటు బోల్తా!

18 మంది మృతి.. రంగంలోకి సహాయక బృందాలు

వియత్నాంలో భారతీయ పర్యాటకులతో వెళ్తున్న స్పీడ్ బోట్ ప్రమాదానికి గురై ఘోర విషాదం చోటుచేసుకుంది. ఫు-క్వాక్ ద్వీప సమూహంలోని ఆన్తోయ్ ద్వీపం సమీపంలోని హోన్ మే రూట్ ప్రాంతంలో పర్యాటకులతో వెళ్తున్న స్పీడ్ బోట్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 18 మంది భారతీయ పర్యాటకులు మృతిచెందినట్లు సమాచారం. పలువురు ఇంకా గల్లంతుకాగా, సముద్రంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ప్రమాదం జరిగిన సమయంలో బోటులో మొత్తం 32 మంది భారతీయులు ప్రయాణిస్తున్నట్లు వియత్నం అధికారులు వెల్లడించారు. ప్రమాదం అనంతరం వియత్నాం కోస్ట్ గార్డ్, స్థానిక రెస్క్యూ బృందాలు వేగంగా సహాయక చర్యలు చేపట్టి 21 మంది పర్యాటకులను సురక్షితంగా రక్షించాయి. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మృతుల పూర్తి పేర్ల జాబితాను అధికారులు ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు. మృతదేహాలను సముద్రం నుంచి వెలికితీసి గుర్తిస్తున్నారు. ఈ పర్యటనను ప్రముఖ సెల్‌ఫోన్ కంపెనీ తన వ్యాపార భాగస్వాముల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విహారయాత్రలో భాగంగా నిర్వహించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయుల పెద్ద బృందం వియత్నాంకు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై వియత్నాం సముద్ర భద్రతా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటనపై భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో సమన్వయం చేస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించేందుకు అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అత్యవసర సమాచారం కోసం +84 91 308 9165, +84 36 281 7930 నంబర్లను సంప్రదించాలని భారత ఎంబసీ సూచించింది. సహాయక చర్యలు పూర్తయిన అనంతరం మృతుల పూర్తి వివరాలు, గల్లంతైన వారి పరిస్థితి, ప్రమాదానికి గల అసలు కారణాలపై వియత్నాం అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.

మృతుల్లో తెలుగు రాష్ట్రాల వాసులున్నారు. కడప జిల్లాకు చెందిన డిస్ట్రిబ్యూటర్‌ శ్రీధర్‌, మచిలీపట్నంకు చెందిన జయశ్రీ మరణించారు. కడపకు చెందిన మరో డిస్ట్రిబ్యూటర్‌ నయీం ఒడ్డున ఉండటంతో ప్రాణాలు దక్కించుకున్నారు.