పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా ఆదివారం మరోసారి వైమానిక దాడులు జరిపింది. ప్రతిగా ఇరాన్‌కు చెందిన IRGC దళాలు కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్లు, బాలిస్టిక్‌ క్షిపణులతో దాడులు చేపట్టాయి. ఈ దాడుల్లో ప్రాణ నష్టం సంభవించకపోయినా, యుద్ధానికి శాశ్వత ముగింపు కోసం వాషింగ్టన్‌-టెహ్రాన్‌ మధ్య కొనసాగుతున్న చర్చల భవిష్యత్తుపై అనిశ్చితి పెరుగుతోంది.

తమపై దాడులు కొనసాగితే అమెరికాతో జరుగుతున్న చర్చలను పూర్తిగా నిలిపివేస్తామని ఇరాన్‌ తాజాగా హెచ్చరించింది. మరోవైపు, ఇరాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఆ దేశం ఉనికిలోనే లేకుండా చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సామాజిక మాధ్యమాల ద్వారా హెచ్చరిక జారీ చేశారు.

ఇరాన్‌ సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఆదివారం తాము మరోసారి దాడులు నిర్వహించామని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అమెరికా దాడులకు ప్రతిగా IRGC దళాలు కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేశాయని అధికారిక సమాచారం వెల్లడించింది.

ఇరాన్‌వైపు నుంచి దూసుకొచ్చిన డ్రోన్లు, రెండు బాలిస్టిక్‌ క్షిపణులను తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని కువైట్‌ సైన్యం తెలిపింది. ఇరాన్‌ దాడుల్లో తమ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఎనిమిది అంతస్తుల భవనం ధ్వంసమైందని బహ్రెయిన్‌ వెల్లడించింది.