రాయలసీమ న్యూస్, నంద్యాల: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని అహోబిలం అటవీ ప్రాంతంలో బుధవారం ఆరు మంది భక్తులు తప్పిపోయిన ఘటన కలకలం రేపింది. నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పావన నరసింహ స్వామి ఆలయ దర్శనానికి వెళ్లిన ఈ భక్తులను గురువారం తెల్లవారుజామున పోలీసులు, అటవీశాఖ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
వివరాల్లోకి వెళ్తే, ప్రొద్దుటూరుకు చెందిన భక్తుల బృందం బుధవారం నరసింహ స్వామి ఆలయ దర్శనానికి కాలినడకన అహోబిలం అటవీ ప్రాంతం వైపు ప్రయాణం ప్రారంభించింది. ఆలయ దర్శనం ముగించుకుని సాయంత్రం తిరుగు ప్రయాణం మొదలుపెట్టిన సమయంలో ఐదు మంది మహిళలు, ఒక పురుషుడు అడవిలో దారి తప్పిపోయారు. అడవి మార్గాలు క్లిష్టంగా ఉండటంతో, చీకటి పడటంతో వారు బయటకు వచ్చే దారి గుర్తించలేకపోయినట్లు సమాచారం.
రాత్రి సమయంలో భక్తులు అడవిలో కనిపించకపోవడంతో విషయం స్థానికులకు తెలిసింది. వెంటనే ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎస్సై వరప్రసాద్, పోలీసు సిబ్బంది, అటవీశాఖ సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు ప్రారంభించారు. అహోబిలం పరిసర అటవీ ప్రాంతంలో రాత్రంతా గాలింపు కొనసాగించారు.
గురువారం తెల్లవారుజామున గాలింపు బృందం అడవిలో తప్పిపోయిన భక్తులను గుర్తించింది. వారిని సురక్షితంగా రక్షించి దిగువ అహోబిలానికి తీసుకువచ్చారు. అడవిలో రాత్రంతా ఆందోళనలో గడిపిన భక్తులు బయటకు రావడంతో ఉపశమనం పొందారు.
ఈ ఘటనతో అహోబిలం ప్రాంతంలో భక్తులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. భక్తులు సురక్షితంగా బయటపడిన వార్త తెలిసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అడవిలోకి వెళ్లే భక్తులు జాగ్రత్తలు పాటించాలని, మార్గదర్శకుల సహాయంతోనే ప్రయాణం చేయాలని స్థానికులు సూచిస్తున్నారు.













