రాయలసీమ న్యూస్, నంద్యాల: ఆత్మకూరు సమీప నల్లమల అటవీ ప్రాంతంలోని కొట్టాల చెరువు చెంచుగూడెంలో 9 ఏళ్ల చిన్నారిపై జరిగిన క్రూర ఘటన స్థానికులను కలవరపెడుతోంది. నాలుగో తరగతి చదువుతున్న పావని అనే బాలికను అదే గూడెంలో దుకాణం నడుపుతున్న మల్లి నాయక్ అనే వ్యక్తి ఇంట్లో స్తంభానికి తాళ్లతో కట్టి గంటల పాటు వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
చెంచుగూడెం కొట్టాల చెరువులో నివసిస్తున్న పావని, ఇంటి సమీపంలో ఉన్న షాపు వద్దకు వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆమె బంధువులు గాలింపు ప్రారంభించారు. చివరకు షాపు యజమాని మల్లి నాయక్ ఇంట్లోనే చిన్నారిని తాళ్లతో స్తంభానికి కట్టి బంధించి, మూడు గంటల పాటు చిత్రహింసలకు గురి చేసినట్లు బాధిత బాలిక తన తల్లిదండ్రులకు తెలిపింది.
ఈ ఘటనలో మల్లి నాయక్‌కు రాజు నాయక్ అనే మరో వ్యక్తి పూర్తిగా సహకరించిన విషయం బయటపడింది. చిన్నారిని ఎందుకు బంధించారని ప్రశ్నించిన గ్రామస్తులకు, తన షాపులో దొంగతనానికి ప్రయత్నించిందని అందుకే బంధించానని మల్లి నాయక్ సమాధానం ఇచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఈ సమాధానంపై బాధిత బాలిక బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను ఎలాంటి దొంగతనం చేయలేదని, షాపు ఎదురుగా నిల్చున్నందుకు మల్లి నాయక్ లోపలికి తీసుకువెళ్లి తాళ్లతో స్తంభానికి కట్టివేసి హింసించాడని బాధిత చిన్నారి పావని తన తల్లిదండ్రులకు రోదిస్తూ చెప్పుకుంది.
మల్లి నాయక్, రాజు నాయక్ ఇద్దరు అగరుబత్తీలతో చేతులకు కాల్చారని, తనతో బలవంతంగా సారా తాగించే ప్రయత్నం చేసారని చిన్నారి గూడెంలో బహిరంగంగా వెల్లడించింది.
చిన్నారి నోటినుంచి బయటపడ్డ మరో విషయంతో గ్రామస్తులు, పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. బాలికను దగ్ధం చేసి, గుట్టుచప్పుడు కాకుండా సమీపంలోని వరదరాజ స్వామి ప్రాజెక్టులో పారవేయాలనే యత్నం చేసినట్లు చిన్నారి వెల్లడించడంతో గ్రామంలో భయాందోళన నెలకొంది.
రెండేళ్ల క్రితం ముచ్చుమర్రిలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసి, మూటకట్టి కృష్ణ నదిలో పడవేసిన ఘటనను ఈ సంఘటన గుర్తు చేస్తోందని కొట్టాల చెరువు గ్రామస్తులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే మల్లి నాయక్, రాజు నాయక్ గతంలో కూడా మహిళలపై అనుచిత ప్రవర్తన, కిశోర బాలికలపై వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి.
తమ కూతురును బంధించి హింసించిన షాపు యజమాని మల్లి నాయక్‌పై ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళుతున్న సమయంలో, షాపు యజమాని, అతని బంధువులు చిన్నారి కుటుంబ సభ్యులను అడ్డుకున్నారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ఇంతటి అమానుష చర్యకు పాల్పడిన మల్లి నాయక్, రాజు నాయక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి తల్లిదండ్రులు, కొట్టాల గిరిజనులు ప్రభుత్వం, పోలీసు శాఖను డిమాండ్ చేస్తున్నారు.
ఈ సంఘటనపై ఆత్మకూరు పోలీసులు బాధిత చిన్నారిని స్టేషన్‌కు తరలించి విచారణ జరుపుతున్నట్లు సమాచారం. అయితే బయటకు మాత్రం తమకు ఇలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్న నేపథ్యంలో, ఘటన బట్టబయలవడంతో స్వయంగా రంగంలోకి దిగినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.













