శ్రీశైలం:- రాయలసీమ ప్రాంతానికి నీటి పంపిణీలో జరుగుతున్న అన్యాయంపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి రాయలసీమకు అన్యాయం పునరావృతమవుతోందని ఆయన ఆరోపించారు. రాయలసీమ అభివృద్ధికి చంద్రబాబు అడ్డంకిగా మారారని విమర్శించారు.

రాయలసీమ హక్కులను కాపాడేందుకు ఈ నెల 24న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద ప్రజాపోరాటం నిర్వహించనున్నట్లు శైలజానాథ్ ప్రకటించారు. ఈ పోరాటంలో రైతులు, మేధావులు, వివిధ వర్గాల ప్రతినిధులు పాల్గొనేలా పిలుపునిచ్చారు.

శ్రీశైలం జలాశయంలో సమృద్ధిగా నీళ్లు ఉన్నప్పటికీ రాయలసీమ రిజర్వాయర్లను నింపకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన మండిపడ్డారు. ఇందుకు బాధ్యత ఎవరిది అనే ప్రశ్నను చంద్రబాబు ప్రభుత్వ ముందుంచారు. సీమ రైతుల నీటి హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వ వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు.

శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు, మాల్యాల, ముచ్చుమర్రి మార్గాల ద్వారా పూర్తి సామర్థ్యంతో 40 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి రాయలసీమలోని అన్ని రిజర్వాయర్లను నింపాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. నీటి విడుదలపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

రాయలసీమకు తగినంత నీటి కేటాయింపుపై ప్రభుత్వం స్పందించకపోతే ప్రాంతవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. నీటి సమస్యపై ప్రజలతో కలిసి పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో సోమవారం గ్రేటర్ రాయలసీమ వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, రైతు విభాగాల నాయకులతో కలిసి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను సందర్శించనున్నట్లు శైలజానాథ్ తెలిపారు. అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించి, ప్రజా పోరాటానికి సంబంధించి తదుపరి కార్యాచరణను నిర్ణయించనున్నట్లు పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి.