రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్:
పరీక్షల వైఫల్యం ధర్మేంద్ర ప్రధాన్‌దే భాద్యత!
సీజేపీ అధినేత అభిజీత్ దీప్కే
న్యూఢిల్లీ : పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వారం రోజుల్లో స్వచ్ఛందంగా పదవికి వైదొలగాలని, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఆయనను పదవి నుంచి తప్పించాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అధినేత అభిజీత్ దీప్కే డిమాండ్ చేశారు. ఆయనను తొలగించే బాధ్యత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీదేనని అభిజీత్ స్పష్టం చేశారు.
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన, పరీక్షల వ్యవస్థలో జరిగిన లోపాలపై కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అంతకుముందు సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో కూడా ఇదే విషయంపై పోస్టు చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి దిగిపోయే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని ఆయన తెలిపారు.
యువత ప్రశ్నలు అడగాల్సిన సమయం వచ్చిందని, వారు గళమెత్తితేనే వ్యవస్థ సక్రమ మార్గంలో నడుస్తుందని అభిజీత్ దీప్కే నొక్కిచెప్పారు. ఐదేళ్లకోసారి ఓటు వేయడం మాత్రమే రాజకీయం కాదని, ప్రజలు ఎవరికి ఓటు వేశారో వారిని ప్రశ్నించే బాధ్యత కూడా తమదేనని ఆయన అభిప్రాయపడ్డారు.
జంతర్‌మంతర్ వద్ద జరిగిన ధర్నాలో ప్రధాని మోదీ గురించి ఎందుకు మాట్లాడలేదని విలేకరులు ప్రశ్నించగా, పరీక్షల వైఫల్యానికి ఎవరు బాధ్యత వహించాలనే విషయాన్ని నిర్ధారించకపోతే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తీసుకోవాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందని అభిజీత్ సమాధానమిచ్చారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలిగిన నాయకత్వం పేపర్ లీక్‌లను ఆపలేకపోవడం ఎలా అని ఆయన ప్రశ్నించారు.
జెన్‌జీ( కాక్రోచ్) ఎవరికీ భయపడదు..
జెన్ జీ భయపడదని శనివారం జంతర్‌మంతర్ వద్ద జరిగిన ధర్నా నిరూపించిందని అభిజీత్ వ్యాఖ్యానించారు. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదని, వారం రోజుల్లో ఈ ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తామని తెలిపారు. జంతర్‌మంతర్ ధర్నా కేవలం ట్రయలర్ మాత్రమేనని ఆయన అన్నారు. తన భద్రతపై తన తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, తాను ఇప్పుడు ఒంటరివాడిని కాదని, తనతో పాటు పెద్ద సంఖ్యలో యువత ఉన్నారని అభిజీత్ దీప్కే చెప్పారు. సీజేపీ ఉద్యమం ప్రారంభమై కేవలం 15 రోజులు మాత్రమే అయినప్పటికీ, ఇప్పుడే భవిష్యత్ రాజకీయ ప్రణాళికల గురించి మాట్లాడటం తొందరపాటు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
పోలీసుల భద్రత కట్టుదిట్టం..
అభిజీత్ దీప్కే నివాసం ఉన్న ఛత్రపతి శంభాజీనగర్‌లో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. గతంలో 11 మంది పోలీసులను మోహరించగా, ఇప్పుడు ఆ సంఖ్యను 15 మందికి పెంచినట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు.
ఇదిలా ఉండగా, కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరును మార్చుకోవాలని బీజేపీ సీనియర్ నేత, హరియాణా మంత్రి అనిల్ విజ్ సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ పోరాడే హక్కు, భావవ్యక్తీకరణ హక్కు ఉన్నప్పటికీ, బొద్దింక కనిపిస్తే చిన్న పిల్లవాడైనా చెప్పుతో కొట్టి చంపుతాడని, అందువల్ల ఆ పార్టీ పేరు మార్చుకోవడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.







