ఆర్ఎస్ఎస్‌, బీజేపీలను ఎదుర్కొనేది మేమే

వచ్చే రెండేళ్లలో కాంగ్రెస్ మరింత బలోపేతం : రాహుల్‌

న్యూఢిల్లీ : దేశంలో సిద్ధాంతపరంగా విచ్ఛిన్నం కాకుండా నిలబడింది కాంగ్రెస్‌ మాత్రమేనని, ఆర్ఎస్ఎస్‌–బీజేపీలను దీటుగా ఎదుర్కొనగలిగేది తమ పార్టీయేనని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఈ సైద్ధాంతిక పటిష్ఠతతో వచ్చే రెండేళ్లలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

టీఎంసీలో రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో, ఆ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేల్లో పలువురు వేరుకుంపటి పెట్టుకోవడం జరుగుతున్న సమయంలో రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. గురువారం ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌చార్జులు, సీనియర్‌ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని రాహుల్‌ గాంధీ విమర్శించారు. దీనికి అంతర్జాతీయ పరిణామాల కంటే కేంద్ర ప్రభుత్వ విధానాలే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై ప్రధాని స్పందించేలా లోక్‌సభలో ఒత్తిడి తీసుకురావాలని పార్టీ ఎంపీలకు సూచించినట్లు సమాచారం.

లోక్‌సభలో డీలిమిటేషన్‌ బిల్లు వీగిపోవడంతో బీజేపీ అహంకారానికి గండిపడిందని, అందుకే అన్ని పార్టీల నుంచి ఎంపీలను చీల్చే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఆరోపించారు. బిల్లు ఆమోదం పొందకపోవడం బీజేపీ వ్యూహానికి ఎదురుదెబ్బగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.

మోదీ పాలనపై దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. జూన్‌ నెలాఖరు నుంచి రెండు, మూడు నెలల పాటు ఈ పోరాటాన్ని కొనసాగించాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. జాతీయ, రాష్ట్ర, జిల్లా, బ్లాక్‌ స్థాయిల వరకు ఆందోళనలు, నిరసనలు నిర్వహించాలని నేతలకు సూచనలు జారీ చేసింది.

భేటీ అనంతరం పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో అసంతృప్తిని ఉద్యమాల రూపంలో వెలికి తేవడమే ఈ కార్యక్రమాల లక్ష్యమని ఆయన వివరించారు. అలాగే, కాంగ్రెస్‌లో మమతా బెనర్జీ పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌ విలీనం అవుతుందన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. అలాంటి కథనాలు ఆధారరహితమని, వాటిని నమ్మవద్దని ఆయన పిలుపునిచ్చారు.