నీట్‌ పేపర్‌ లీక్‌ వివాదం, విద్యార్థుల ఆందోళనల వేళ కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖలో కీలక మార్పు చేసింది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న వినీత్‌ జోషిని బదిలీ చేసి.. ఆయన స్థానంలో నరేశ్‌ పాల్‌ గంగ్వార్‌ను నియమించింది. వినీత్‌ జోషికి మాత్రం పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది. అయితే ఈ బదిలీపై ఇప్పుడు చర్చ మొదలైంది.

విద్యా వ్యవస్థలో కీలక ముఖం.. 1992 బ్యాచ్‌కు చెందిన మణిపూర్‌ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి వినీత్‌ జోషి.. కేంద్ర విద్యా వ్యవస్థలో కీలక పాత్ర పోషించిన అధికారుల్లో ఒకరు. పరిపాలనలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న ఆయన.. పరీక్షల నిర్వహణ నుంచి విద్యా విధానాల అమలు వరకు పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రవేశ పరీక్షలకు కేంద్ర బిందువైన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) తొలి డైరెక్టర్‌ జనరల్‌గా వినీత్‌ జోషి పనిచేశారు. నీట్‌, జేఈఈ వంటి ప్రతిష్టాత్మక పరీక్షలను నిర్వహించే సంస్థ ప్రారంభ దశలో ఆయన కీలక బాధ్యతలు చేపట్టారు. అనంతరం కేంద్ర విద్యాశాఖలో అదనపు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.