రాష్ట్రంలో పరిస్థితులు అత్యంత దారుణం

హేరామ్‌.. సేవ్‌ ఆంధ్రా.. : వైఎస్‌ జగన్‌ సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం కుల, మత ప్రతిపాదికన దారుణమైన రాజకీయాలు చేస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఎస్‌ఐఆర్‌ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియ పేరుతో ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఓట్ల తొలగింపుతోనే ఆగిపోలేదని, రాష్ట్రంలో కుల, మతాల పేరుతో విభజన రాజకీయాలకు తెరలేపిందని జగన్‌ అన్నారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు ఇలాంటి పరిణామాలు కనిపిస్తున్నాయని, అధికార పదవుల్లో ఉన్నవారే దళితులు, దళిత క్రైస్తవులు, ఇతర బడుగు, బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకుని అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

బడుగు, బలహీన వర్గాలను బహిరంగంగా కించపరుస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని జగన్‌ ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, వాటిని పరోక్షంగా ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చుపెట్టి, మత విద్వేషాలను రెచ్చగొట్టి సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ పరిస్థితులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ.. "హే రామ్‌.. సేవ్‌ ఆంధ్రా" అంటూ పిలుపునిచ్చారు.

దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని జగన్‌ గుర్తుచేశారు. ఈ అంశంపై జస్టిస్‌ బాలకృష్ణన్‌ కమిటీ అధ్యయనం చేస్తోందని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మతాన్ని రిజర్వేషన్లతో ముడిపెట్టడం సరికాదని అసెంబ్లీలో తీర్మానం చేశామని, అదే అంశంపై జస్టిస్‌ బాలకృష్ణన్‌ కమిటీకి కూడా అధికారికంగా తమ అభిప్రాయాన్ని తెలియజేశామని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో దళిత క్రైస్తవుల రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు వైఖరి ఏమిటో రాష్ట్ర ప్రజలకు స్పష్టం చేయాలని జగన్‌ డిమాండ్‌ చేశారు. "చేతనైతే ప్రజలకు మంచి చేయండి.. విద్వేషాలను మాత్రం రెచ్చగొట్టొద్దు" అంటూ చంద్రబాబుకు వైఎస్‌ జగన్‌ హితవు పలికారు.

సాయికృష్ణ కేసులో కవర్‌అప్ జరిగిందా?

విజయవాడ సాయికృష్ణ కేసులో పోలీసు ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికారులను మాత్రమే బాధ్యులుగా చూపిస్తూ అసలు విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరోపించారు. సాయికృష్ణ రిమాండ్ రిపోర్ట్‌ను పరిశీలిస్తే పై అధికారులను ఎలా కాపాడుతున్నారో స్పష్టంగా అర్థమవుతుందని ఆయన అన్నారు. సాయికృష్ణను మార్కాపురం నుంచి టాస్క్‌ఫోర్స్ పోలీసులు తీసుకువచ్చి కృష్ణలంక పోలీసులకు అప్పగించారని, దీనికి సంబంధించిన అక్‌నాలెడ్జ్‌మెంట్ కూడా ఉందని జగన్ పేర్కొన్నారు. సాయికృష్ణ తల్లి, బంధువులు సీపీ, డీజీపీకి ఫిర్యాదులు చేసినా స్పందించలేదని, రాష్ట్రంలో వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలిపోయాయని ఆరోపించారు.

కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ విషయంలోనూ అనేక సందేహాలు ఉన్నాయని జగన్ అన్నారు. ఒక రిమాండ్ రిపోర్ట్‌లో నెల రోజుల ఫుటేజ్ లేదని, మరో రిపోర్ట్‌లో 18 నెలల ఫుటేజ్ అందుబాటులో లేదని పేర్కొనడం అనుమానాలకు తావిస్తోందన్నారు. క్లౌడ్ సర్వర్లలో డేటా అందుబాటులో ఉన్నప్పటికీ దానిని ఎందుకు సేకరించలేదని, కాల్ రికార్డులు ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించిన జగన్, సాయికృష్ణ కేసుతో పాటు ఇతర ఘటనల్లోనూ పూర్తి స్థాయిలో విచారణ జరగాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో న్యాయవ్యవస్థ, చట్ట అమలుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌..

చంద్రబాబు సినిమా లో విలన్ లా వ్యవహరిస్తున్నారు..:

‘ఎక్కడా నైతిక విలువల్లేవ్‌.. మానవత్వం మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. జంగిల్‌రాజ్‌ అంటే ఎక్కడో బిహార్‌లో లేదు.. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లోనే చంద్రబాబు పాలన రూపంలో కనిపిస్తోంది’’ అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. గత 18 నెలలుగా వరుసగా కొనసాగుతున్న అరాచకాలే అందుకు నిదర్శనమని అన్నారాయన.

భూమి ఇవ్వని రైతులను భూసేకరణపేరుతో వేధిస్తున్నారు. కొడవీటి వాగును బలవంతంగా రైతుల పొలాల్లోకి తరలించారు.  రాజధాని ప్రాంత రైతులు అడుగుతున్న దాంట్లో తప్పేముంది? ఇంకా భూముల అవసరం ఏముంది?. భూములు లాక్కుని ఎందుకు వెళ్లగొడుతున్నారని రైతులు అడుగుతున్నారు?. రైతులు పడే అవస్థలు బయటకు రావొద్దనే చంద్రబాబు ఈ డ్రామాలు ఆడుతున్నారు. రైతులకే కాదు.. ఆయన పాలనలో ఎవరికీ రక్షణ లేదు. పశ్నిస్తే రౌడీ షీటర్లు అని ముద్ర వేస్తున్నారు. ఎన్టీఆర్‌ బతికే ఉంటే.. ఆయనకు ప్రశ్నించే సమయం ఉండి ఉంటే.. ఆయన్ని కూడా చంద్రబాబు రౌడీ షీటర్‌ అనేవారేమో. విలన్లు సినిమాల్లో ఉండరు.. చంద్రబాబు రూపంలో ఇక్కడే ఉంటారు. వైఎస్‌ జగన్‌ అన్నారు.