116 ఏళ్ల వృద్ధురాలికి.. శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనం

ఛైర్మన్‌ బీ ఆర్‌ నాయుడు చొరవ

శ్రీవారి దర్శనం కోసం కాలినడకన వచ్చిన 116 ఏళ్ల వృద్ధురాలు నవనీతమ్మకు టిటిడి వీఐపీ బ్రేక్‌ దర్శనం కల్పించింది. ఛైర్మన్‌ బీ ఆర్‌ నాయుడు చొరవతో వృద్ధురాలి కుటుంబానికి తితిదే అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. వృద్ధురాలిని దగ్గరుండి దర్శనానికి తీసుకెళ్లారు. రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. తితిదే ఈవో ముద్దాడ రవిచంద్ర పట్టువస్త్రం కప్పి.. తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆమె కాలికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.

వృద్ధురాలు శనివారం అలిపిరి నడకమార్గంలో తిరుమలకు వచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరలైంది. తొలుత వృద్ధురాలి వివరాలు తెలియరాలేదు. కర్ణాటకకు చెందినవారిగా ప్రచారం జరిగింది. దీనిపై తితిదే ఛైర్మన్‌ స్పందించి వృద్ధురాలి వివరాలు తెలిస్తే తన కార్యాలయాన్ని నేరుగా సంప్రదించాలని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ క్రమంలో తితిదే విజిలెన్స్‌ సిబ్బంది ఆమె వివరాలను సేకరించారు. తమిళనాడుకు చెందిన నవనీతమ్మగా గుర్తించారు. ప్రస్తుతం తిరుపతి జీవకోనలో బంధువుల వద్ద ఉంటున్నట్లు తితిదే ఛైర్మన్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో మరోసారి తితిదే ఛైర్మన్‌ స్పందించి వృద్ధురాలితో పాటు కుటుంబసభ్యులకు వీఐపీ బ్రేక్‌ దర్శనం ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.