రాయలసీమ న్యూస్, తిరుపతి: తిరుపతి జిల్లాలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, ఏపీఐఐసీ ప్రాజెక్టులు, భూసేకరణ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావుతో కలిసి వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ నడికుడి–శ్రీకాళహస్తి, ఏర్పేడు–పూడి, గూడూరు–రేణిగుంట, పాకాల–తిరుపతి, తిరుపతి–కాట్పాడి, అరక్కోణం–రేణిగుంట రైల్వే మార్గాల అభివృద్ధి పనులు, నాయుడుపేట–రేణిగుంట, రేణిగుంట–కడప, రేణిగుంట–చెన్నై జాతీయ రహదారుల విస్తరణ పనుల పురోగతిని అధికారులు వివరంగా సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న పనులను వేగంగా పూర్తి చేయాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు.
వైజాగ్–చెన్నై కారిడార్, ఏపీఐఐసీ, దుగ్గరాజపట్నం పోర్టు, ఏడీబీ రోడ్లు తదితర కీలక ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, నిర్మాణ పనులపై కూడా కలెక్టర్ దృష్టి సారించారు. శ్రీ సిటీ ఫేజ్–2, ఎల్‌జీ ఫేజ్–1, 2, 3, స్పేస్ సిటీ, నాయుడుపేట ఫేజ్–2, వానెల్లూరు, పాగలి, రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన సూచించారు.
భూసేకరణకు సంబంధించి కోర్టుల్లో కొనసాగుతున్న కేసులు, వెబ్‌ల్యాండ్ సమస్యలు వంటి అంశాలను సైతం తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భూ వివాదాల పరిష్కారానికి ఆర్డీఓలు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం పెంచి, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
వడమాలపేట, ఏర్పేడు మండలాల్లో టీటీడీ ఉద్యోగులకు కేటాయించిన ఇళ్ల స్థలాల సమస్యలను కూడా త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సమావేశంలో పేర్కొన్నారు. ఉద్యోగులకు కేటాయించిన స్థలాలపై ఉన్న ఇబ్బందులను తొలగించేందుకు సంబంధిత విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
సమావేశంలో ఆర్డీఓలు, ఏపీఐఐసీ, రైల్వే, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, విద్యుత్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టుల పురోగతిపై వారు కలెక్టర్‌కు వివరాలు అందించారు. జిల్లాలో జరుగుతున్న ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలు నిర్ణీత కాలవ్యవధిలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మరోసారి స్పష్టం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.













