రాయలసీమ న్యూస్, తిరుపతి: తిరుపతి జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. అటవీ చెక్‌పోస్టు సిబ్బంది విధి నిర్వహణలో భాగంగా విజిల్ ఊదటంతో లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడం, దాంతో వెనుక వస్తున్న ఆటో ఢీకొనడం ఈ దుర్ఘటనకు కారణమైంది.
పోలీసుల కథనం ప్రకారం, బెంగళూరు నుంచి శ్రీకాళహస్తి వైపు కలప లోడ్‌తో ఒక లారీ వెళ్తోంది. అదే మార్గంలో చిత్తూరు జిల్లా యాదమరి మండలం పెరుమాళ్లపల్లి నుంచి తిరుపతిలోని బంధువుల వివాహానికి హాజరుకావడానికి పదకొండు మందితో కూడిన ఒక ఆటో బయల్దేరింది.
పాకాల మండలంలోని గాదంకి వద్ద పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై ఉన్న అటవీ చెక్‌పోస్టు వద్దకు చేరుకునే సరికి అక్కడ విధుల్లో ఉన్న అటవీ సిబ్బంది తనిఖీ నిమిత్తం విజిల్ ఊదారు. దీనితో కలప లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేశాడు. అదే వేగంతో వెనుక నుంచి వస్తున్న ఆటో అదుపుతప్పి లారీని బలంగా ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న చిత్తూరు గ్రామీణ మండలం వేనుగుంటపల్లికి చెందిన యనమల మాధవి (37), ఆమె కుమార్తె మేఘన (15) అక్కడికక్కడే మృతిచెందారు. మాధవి తమ్ముడు, పెరుమాళ్లపల్లికి చెందిన పులికంటి రాజశేఖర్ (25)ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయారు. మాధవి తల్లి పులికంటి బేబీ (50) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ప్రమాదంలో ఆటో డ్రైవర్ పులికంటి సుబ్రహ్మణ్యం, పి. చిన్నబ్బ, పి. రఘు, పి. నవీన్, కొమ్ము విష్ణు, యనమల సూరి, చాముండేశ్వరి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని తక్షణమే రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనాలను రహదారి పక్కకు తరలించి ట్రాఫిక్‌ను సజావుగా కొనసాగించేలా చర్యలు తీసుకున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.













