తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 1,500 కండక్టర్‌ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ యాజమాన్యమే ఈ నియామక ప్రక్రియను నిర్వహించనుంది. పదో తరగతి విద్యార్హత ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయాలని సంస్థ నిర్ణయించినట్లు సమాచారం.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీజీఎస్‌ఆర్టీసీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటివరకు కండక్టర్‌ పోస్టుల భర్తీ జరగలేదు. ఇదే సమయంలో ప్రతి ఏడాది సేవలో ఉన్న ఉద్యోగులు పదవీ విరమణ పొందుతుండటంతో ఖాళీల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో కొంతకాలం క్రితం ఔట్‌సోర్సింగ్‌ విధానంలో తాత్కాలికంగా హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ సహా వివిధ రీజియన్ల పరిధిలోని డిపోల్లో కండక్టర్‌లను నియమించారు.

ఇప్పుడు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో శాశ్వత నియామకాల దిశగా ఆర్టీసీ యాజమాన్యం ముందడుగు వేస్తోంది. మొత్తం 1,500 కండక్టర్‌ పోస్టులను భర్తీ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించినట్లు సంస్థ వర్గాలు తెలియజేస్తున్నాయి. రీజియన్ల వారీగా ఖాళీల వివరాలు, రిజర్వేషన్‌ కోటాలను పరిగణనలోకి తీసుకుని నియామక ప్రక్రియను నిర్వహించే దిశగా ఆలోచనలు సాగుతున్నాయి.

కండక్టర్‌ పోస్టుల ఎంపికలో పదో తరగతి మార్కుల శాతాన్ని ఆధారంగా తీసుకునే విధానం ఆర్టీసీలో అమల్లో ఉంది. అయితే విద్యా వ్యవస్థలో మార్పుల కారణంగా ఒక దశలో గ్రేడింగ్‌ విధానం అమలులోకి వచ్చింది. ఆ తరువాత మళ్లీ మార్కుల శాతం విధానానికి తిరిగి వచ్చారు. ఈ మార్పుల వల్ల కండక్టర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల్లో కొందరు మార్కుల శాతంతో, మరికొందరు గ్రేడ్‌ పాయింట్లతో ఉండే పరిస్థితి ఏర్పడింది.

ఈ రెండు విధానాలను ఎలా సమన్వయం చేయాలన్న అంశంపై ఆర్టీసీ యాజమాన్యం ప్రస్తుతం పరిశీలన జరుపుతోంది. గ్రేడింగ్‌ విధానంలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల గ్రేడ్‌ పాయింట్లను మార్కుల శాతంగా ఎలా మార్పిడి చేయాలన్న విషయంపై స్పష్టత కోసం ఎస్సెస్సీ బోర్డును సంప్రదించింది. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం ఇటీవల ఎస్సెస్సీ బోర్డుకు లేఖ రాసినట్లు ఒక అధికారి తెలిపారు.

ఎస్సెస్సీ బోర్డు నుంచి మార్గదర్శకాలు అందిన తరువాతే కండక్టర్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేయాలని ఆర్టీసీ భావిస్తోంది. మార్కుల శాతం, గ్రేడింగ్‌ విధానాల మధ్య సమానత్వం తీసుకురావడం ద్వారా అభ్యర్థులందరికీ న్యాయం జరిగేలా ఎంపిక ప్రమాణాలను ఖరారు చేయాలని యాజమాన్యం ప్రయత్నిస్తోంది.