రాయలసీమ న్యూస్, అన్నమయ్య: రాయచోటి : కన్వీనర్ కోటాలో ఇంజినీరింగ్ సీట్లు పొందిన విద్యార్థుల నుంచి ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు హాస్టల్, బస్, డొనేషన్, కోచింగ్ తదితర పేర్లతో అదనపు ఫీజులు వసూలు చేస్తున్న దోపిడీని ప్రభుత్వం తక్షణమే అరికట్టాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. అంకన్న డిమాండ్ చేశారు.
ఆదివారం పీడీఎస్‌యూ రాయలసీమ ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. కన్వీనర్ కోటాలో మంచి ర్యాంకులు సాధించి సీట్లు పొందిన విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపడం ద్వారా వారి విద్యా హక్కులను కాలరాస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
“అదనపు ఫీజులు చెల్లిస్తేనే అడ్మిషన్.. లేకపోతే సీటు ఇవ్వం” అంటూ విద్యార్థులు, తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకురావడం దారుణం
అని ఎం. అంకన్న పేర్కొన్నారు.
పేద, మధ్యతరగతి విద్యార్థులు కష్టపడి ర్యాంకులు సాధిస్తే, వారి సీట్లను అడ్డుపెట్టుకుని కాలేజీలు డబ్బులు దండుకోవడం విద్యా వ్యవస్థకే మచ్చగా మిగిలిపోతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యను వ్యాపారంగా మార్చిన కాలేజీ యాజమాన్యాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
కన్వీనర్ కోటా సీట్ల పేరుతో అదనపు ఫీజులు వసూలు చేయకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, ఇంజినీరింగ్ కాలేజీలపై ప్రభుత్వం ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ఎం. అంకన్న కోరారు. అక్రమంగా వసూలు చేసిన మొత్తాలను విద్యార్థులకు తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను సకాలంలో విడుదల చేయాలని, కన్వీనర్ కోటా సీట్లు కాలేజీ యాజమాన్యాల సొంత ఆస్తులు కాదని, విద్యార్థుల హక్కులను డబ్బుతో కొనలేరని ప్రభుత్వం స్పష్టమైన సందేశం ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు.
విద్యార్థులపై అదనపు ఫీజుల భారాన్ని మోపకుండా ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఎం. అంకన్న మరోసారి కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా, నగర నాయకులు దుర్గేష్, ఖాసీం తదితరులు పాల్గొన్నారు.













