రేణిగుంట - : పెళ్లి సమయంలో చేసిన అప్పులు జీవితాన్ని గాలికొదిలేశాయి. భార్యను బాగా చూసుకోవాలని, అప్పుల బారం నుంచి బయటపడాలని ఊరు కాని ఊరు చేరి కూలి పనులు చేస్తూ పోరాడిన ఓ యువకుడు చివరికి ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్న ఘటన రేణిగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం ముత్తరపల్లి గ్రామానికి చెందిన కె. చిరంజీవి (24) వివాహ సమయంలో దాదాపు రూ.4 లక్షల వరకు అప్పులు చేసినట్లు సమాచారం. ఆ అప్పులను తీర్చేందుకు మార్గం కనిపించక రేణిగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపురం గ్రామం వద్ద ఉన్న ఇటుకల తయారీ కేంద్రంలో కూలీగా చేరాడు. భార్య నాగవేణితో కలిసి అక్కడే రేకుల షెడ్డులో నివాసముంటూ, రోజూ కష్టపడి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

అయితే ఎంత కష్టపడినా అప్పుల భారమే తగ్గకపోవడంతో చిరంజీవి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల ఒత్తిడి అతనిని మానసికంగా వేధించడంతో పరిస్థితి మరింత విషమించింది.

ఈ నెల 9వ తేదీ రాత్రి చిరంజీవి తన సోదరి చందనకు ఫోన్ చేసి, అప్పుల పరిస్థితి గురించి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇక అప్పులు తీర్చడం తన వల్ల కావడం లేదని, పరిస్థితి తాను తట్టుకోలేకపోతున్నానని ఫోన్‌లో చందనకు చెప్పినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

అదే రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత, తెల్లవారుజామున సుమారు 3.30 గంటల సమయంలో చిరంజీవి తాను ఉంటున్న రేకుల షెడ్డు పైకప్పు ఐరన్ రాడ్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పక్కింట్లో నివసిస్తున్న వ్యక్తి ఉదయం ఈ దృశ్యాన్ని గమనించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

భర్త మరణంపై తనకు ఎలాంటి అనుమానాలు లేవని, అప్పుల బాధను తట్టుకోలేకనే ఈ తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడని భార్య నాగవేణి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు ఆధారంగా రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేశారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్లు రేణిగుంట పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. అప్పుల బారిన యువకుడు ప్రాణాలు తీసుకోవడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.