తిరుపతి: రాష్ట్రంలో ప్రజలు సౌహార్దంగా, కులాల మధ్య ఐక్యతతో జీవిస్తే ఓర్వలేని స్థితిలో ‘గొడ్డలి’ పార్టీ నాయకులు ఉన్నారని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ఆరోపించారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఆ పార్టీ కుట్రలు పన్నుతోందని తీవ్ర స్థాయిలో విమర్శించారు.

తిరుపతిలో బుధవారం జరిగిన సంక్షేమ సభ అనంతరం కలెక్టరేట్‌లో విలేకరులతో మంత్రి మాట్లాడారు. తిరుపతిలో జరిగిన సంక్షేమ సభకు ప్రజల నుంచి లభించిన విశేష స్పందనను చూసి గొడ్డలి పార్టీ నేతలు అసహనంతో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే అవిలాల, దామినేడు భూముల అంశంపై ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

ఆ పార్టీ అధ్యక్షుడు, నేతలు ‘స్పైడర్‌’ సినిమాలోని సైకో పాత్రలా ప్రవర్తిస్తున్నారని మంత్రి విమర్శించారు. రాష్ట్రంలో ఏ ఇద్దరు సంతోషంగా ఉన్నా, రెండు కులాల వారు కలిసిమెలిసి ఉన్నా చూసి ఓర్వలేని స్థితిలో ఉన్నారని, కుల విభేదాలు రెచ్చగొట్టే దిశగా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

గొడ్డలి పార్టీ నేతలు బెదిరింపులకు దిగుతున్న నేపథ్యంలో ప్రజలకు భయపడాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. “నరుకుతాం, కోస్తాం” అంటూ బెదిరించినా ఇక్కడ ఎవరూ భయపడరని ఆయన తెలిపారు. చట్టప్రకారం మాత్రమే వ్యవహరించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి వల్లే ఆ పార్టీ నేతలు ఇప్పటికీ బతికిపోతున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్న యూట్యూబ్‌ ఛానళ్ల, సోషల్‌ మీడియా బాధ్యులపై ఇప్పటికే కేసులు నమోదు చేసినట్టు మంత్రి వివరించారు. పరువునష్టం దావాలు కూడా వేశామని హెచ్చరించారు. నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు సహించబోమని స్పష్టం చేశారు.

గొడ్డలి పార్టీకి వచ్చే ఎన్నికల్లో అవకాశమే లేదని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. 2029 మాత్రమే కాదు, 2049 వరకు కూడా ఆ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి మరో మూడేళ్లు పూర్తి అధికారం ఉందన్న విషయాన్ని ఆ పార్టీ గుర్తుంచుకోవాలని సూచించారు.

అవిలాల భూముల వ్యవహారంపై మంత్రి స్పందిస్తూ, కోర్టు ఉత్తర్వులు, చట్టబద్ధమైన ప్రక్రియల అనంతరం మాత్రమే అక్కడ చర్యలు జరిగాయని తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి, తనకు ఎలాంటి అక్రమ సంబంధం లేదని ఉద్ఘాటించారు. భూముల అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించి ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్న గొడ్డలి పార్టీ నేతల ఉద్దేశం బహిర్గతమైందని వ్యాఖ్యానించారు.