శ్రీకాళహస్తి: కూటమి ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తోందని, కుట్రలు చేసే పార్టీలు, వ్యక్తులకు తాము జవాబుదారీ కాదని రాష్ట్ర టీడీపీ కార్యదర్శి మాసారపు సుబ్బయ్య తెలిపారు. వైసీపీ నేతలకు దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చకు సిద్ధం కావాలని ఆయన సవాల్‌ విసిరారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో APPSC Group-1 పరీక్షల్లో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవకతవకలు, అక్రమాలపై అసెంబ్లీలో చర్చ జరిగితే వాస్తవాలు బహిర్గతం అవుతాయనే భయంతోనే వైసీపీ నేతలు అసెంబ్లీకి రావడం లేదని సుబ్బయ్య ఆరోపించారు. రోడ్డుపై hit and run తరహాలో విమర్శలు చేయడం కాకుండా అసెంబ్లీకి వచ్చి ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం వైసీపీ నేతలు చూపాలని ఆయన వ్యాఖ్యానించారు.

DSC ద్వారా ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని, రాష్ట్రంలో ఎలాంటి కుట్రలు పనిచేయవని మాసారపు సుబ్బయ్య స్పష్టం చేశారు. DSC నియామకాలు పూర్తి పారదర్శకతతో, బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో జరిగాయని ఆయన పేర్కొన్నారు.

విద్యా విధానంలో సంస్కరణలతో పాటు నియామక పరీక్షల్లో మరింత పారదర్శకత తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారని సుబ్బయ్య గుర్తుచేశారు. ఈ దిశగా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని ఆయన అన్నారు.

మంత్రి నారా లోకేష్ ఇప్పటికే వైసీపీ నేతలకు బహిరంగ చర్చకు సవాల్‌ విసిరిన విషయాన్ని సుబ్బయ్య ప్రస్తావించారు. నిన్న అసెంబ్లీలో కూడా ఇదే అంశంపై లోకేష్ మరోసారి సవాల్‌ చేసినట్లు తెలిపారు. నిజాయితీపై నమ్మకం ఉంటే, దమ్ము, ధైర్యం ఉంటే ఆ సవాల్‌ను స్వీకరించి అసెంబ్లీకి వచ్చి చర్చకు సిద్ధం కావాలని వైసీపీ నేతలను మాసారపు సుబ్బయ్య కోరారు.