రాయలసీమ న్యూస్, తిరుపతి: శ్రీకాళహస్తి పట్టణంలో ప్రయాణికుల భద్రతను బలోపేతం చేయడానికి పోలీసు శాఖ కొత్త చర్యలు చేపట్టింది. స్థానిక బేరివారి మండపం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు స్కానర్‌తో కూడిన ప్రత్యేక గుర్తింపు కార్డులను డీఎస్పీ నరసింహమూర్తి అందజేశారు.
ఆటోల్లో ప్రయాణించే సమయంలో ప్రయాణికులకు డ్రైవర్‌పై ఏదైనా అనుమానం కలిగినా, డ్రైవర్ ప్రవర్తన సక్రమంగా లేకపోయినా గుర్తింపు కార్డుపై ఉన్న స్కానర్‌ను ఉపయోగించి డ్రైవర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుందని డీఎస్పీ నరసింహమూర్తి తెలిపారు.
ఆటో డ్రైవర్ల వివరాలు, గుర్తింపు తదితర సమాచారాన్ని ప్రయాణికులకు అందుబాటులో ఉంచడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు, వృద్ధులు ఆటోల్లో ప్రయాణించే సమయంలో భద్రతపై ఎలాంటి అనుమానం కలిగినా వెంటనే సంబంధిత సమాచారాన్ని పరిశీలించుకునే వీలుంటుందని వివరించారు.
ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఇటువంటి చర్యలు చేపడుతున్నట్లు డీఎస్పీ నరసింహమూర్తి తెలిపారు. ఆటో డ్రైవర్లు కూడా ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించాలని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ఈ స్కానర్ గుర్తింపు కార్డుల విధానం ద్వారా ఆటో ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీఎస్పీ నరసింహమూర్తి వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సీఐ వెంకటేష్, టూ టౌన్ సీఐ నాగరాజు, ఎస్సై రామకృష్ణ, ట్రాఫిక్ ఎస్సై గోవిందు, ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ మునస్వామి, కానిస్టేబుల్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.













