రాయలసీమ న్యూస్, తిరుపతి: తిరుపతి: శ్రీవారి బ్రహ్మోత్సవాలు–2026ను దృష్టిలో ఉంచుకుని తిరుమలలో భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ మరియు బందోబస్తు ఏర్పాట్లను ముందస్తుగా పటిష్టం చేయాలని తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు పోలీసు అధికారులు ప్రత్యేక కార్యాచరణను ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో తిరుమల డీఎస్పీ, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులు, తిరుమల 2 టౌన్ సీఐ, AVSO తదితర అధికారులు విజిలెన్స్ సిబ్బందితో కలిసి ఈరోజు తిరుమలలోని కీలక ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన గరుడసేవ రోజున భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున, భక్తుల రాకపోకలు సజావుగా సాగేందుకు, అవసరమైన సమయంలో భక్తులను సురక్షితంగా బయటకు తరలించే విధంగా నిష్క్రమణ ప్రణాళికపై విస్తృతంగా చర్చించారు.
భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలైన లేపాక్షి సర్కిల్, SV షాపింగ్ కాంప్లెక్స్, SMC, సుపథం, రాగిమాను జంక్షన్ ప్రాంతాలను అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో భక్తుల రద్దీ నియంత్రణ, రాకపోకల నిర్వహణ, బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ మరియు అత్యవసర పరిస్థితుల్లో చేపట్టాల్సిన చర్యలపై క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పోలీసు మరియు విజిలెన్స్ విభాగాలు సమన్వయంతో పనిచేసేలా ముందస్తు కార్యాచరణను రూపొందిస్తున్నారు. కీలక ప్రాంతాల్లో అవసరమైన పోలీసు బందోబస్తు, రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, ప్రవేశ–నిష్క్రమణ మార్గాల పర్యవేక్షణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించిన అంశాలు, అవసరమైన భద్రతా చర్యలపై పోలీసు–విజిలెన్స్ అధికారులతో మరోసారి సంయుక్త సమావేశం నిర్వహించి, తదుపరి కార్యాచరణను ఖరారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. గరుడసేవ రోజున భక్తుల సురక్షిత నిష్క్రమణ, రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసి, అమలు చర్యలను దశలవారీగా చేపట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారు.













