రాయలసీమ న్యూస్, తిరుపతి: సూళ్ళూరుపేట: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట నియోజకవర్గ పరిధిలోని కీలక సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి పనులపై స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గ రైతాంగ ప్రయోజనాలను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఆమె ఇటీవల రాష్ట్ర నీటిపారుదల (జలవనరుల) శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని హైదరాబాద్‌లో కలిసి, సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పలు ప్రధాన నీటిపారుదల పనులపై ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మంత్రి దృష్టిని ఆకర్షించారు. మీజూరు చెక్‌డ్యామ్ నిర్మాణానికి అవసరమైన నిధులను తక్షణమే మంజూరు చేసి, ఆ ప్రాంతంలో భూగర్భ జలమట్టం పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆమె వినతిపత్రం ద్వారా కోరారు. తీరప్రాంతం మరియు నదీ పరివాహక ప్రాంత రక్షణకు ఉద్దేశించిన వాటంబేడు గ్రాయిన్ పనులను త్వరితగతిన ప్రారంభించేలా చూడాలని, ఆయకట్టు రైతులకు సమృద్ధిగా సాగునీరు అందించేందుకు చెంబేడు రిజర్వాయర్ పనులను పునరుద్ధరించి అవసరమైన బడ్జెట్ విడుదల చేయాలని కూడా ఆమె ప్రతిపాదించారు.
ఈ మూడు కీలక ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేసి, పనులను సత్వరమే ప్రారంభించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మంత్రి నిమ్మల రామానాయుడిని కోరారు. ఆమె వినతులకు మంత్రి నిమ్మల రామానాయుడు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నీటిపారుదల సదుపాయాల విస్తరణ, బలోపేతంపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందనే నమ్మకాన్ని ఎమ్మెల్యే వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఒక మహిళా ప్రజాప్రతినిధిగా నియోజకవర్గంలోని ప్రతి చిన్న సమస్యపైనా డాక్టర్ నెలవల విజయశ్రీ నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. నీటిపారుదల శాఖతో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులతో ఆమె నేరుగా మాట్లాడుతూ, క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ప్రజా సమస్యల పట్ల ఆమె చూపుతున్న చొరవ, నియోజకవర్గ అభివృద్ధికి చేస్తున్న నిరంతర కృషి పట్ల సూళ్ళూరుపేట నియోజకవర్గ ప్రజలు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ఆమె తీసుకుంటున్న ప్రత్యేక ఆసక్తి, రైతాంగానికి ఊరట కలిగించేలా ఉందని రైతులు భావిస్తున్నారు.













