రాయలసీమ న్యూస్, తిరుపతి: తిరుపతి జిల్లా నాయుడుపేటలోని జూనియర్ సివిల్ కోర్టు వద్ద న్యాయవాదులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతపురంలో ఓ న్యాయవాది పట్ల పోలీసులు దురుసుగా, అవమానకరంగా ప్రవర్తించిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నిరసన చేపట్టారు.
అనంతపురం ఘటనలో అక్కడి న్యాయవాదులు సుమారు 15 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. వారి నిరసన అనంతరం పోలీసులు తమ తప్పును ఒప్పుకుని క్షమాపణలు చెప్పినట్లు నాయుడుపేట న్యాయవాదులు పేర్కొన్నారు. అయినప్పటికీ, న్యాయవాదుల పట్ల పోలీసులు ప్రదర్శించిన అవమానకర వైఖరిని ఖండిస్తూ నాయుడుపేట కోర్టు వద్ద కూడా నిరసన తెలుపుతున్నట్లు వారు తెలిపారు.
న్యాయవాదులపై పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడం సమంజసం కాదని, న్యాయవాదులను గౌరవించడం కూడా పోలీసుల విధుల్లో భాగమై ఉండాలని నాయుడుపేట లాయర్ చంగయ్య అభిప్రాయపడ్డారు. న్యాయవాదులపై దురుసు ప్రవర్తన, అవమానకర వ్యవహారం పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం, పోలీసు శాఖ తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
పోలీసులు న్యాయవాదుల పట్ల దురుసుగా ప్రవర్తించడం, అవమానించడంతో సమానం. ఇలాంటి చర్యలను పోలీసులు వెంటనే మానుకోవాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో తెలియజేసిన న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తక్షణమే గుర్తించి, వారికి న్యాయం జరిగే విధంగా న్యాయవాదుల రక్షణ చట్టాన్ని రూపొందించి అమలు చేయాల్సిన అవసరం ఉందని చంగయ్య పేర్కొన్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే న్యాయవాదులపై దాడులు, అవమానకర ప్రవర్తనలను అరికట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇకపై పోలీసులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే న్యాయవాదులుగా సహించేది లేదని చంగయ్య హెచ్చరించారు. న్యాయవాదుల గౌరవం, భద్రతకు భంగం కలిగించే చర్యలపై రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు ఏకమై పోరాటం చేయాల్సిన పరిస్థితి రాకూడదని ఆయన వ్యాఖ్యానించారు.
నాయుడుపేట జూనియర్ సివిల్ కోర్టు వద్ద జరిగిన ఈ నిరసనలో పలువురు న్యాయవాదులు పాల్గొని, అనంతపురం ఘటనను ఖండిస్తూ న్యాయవాదుల రక్షణ చట్టం అమలుకు మద్దతు ప్రకటించారు.













