రాయలసీమ న్యూస్, తిరుపతి: సూళ్ళూరుపేట: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని సూళ్ళూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ నిరంతరం శ్రమిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకు ఆమె మంగళవారం అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కాళంగి బ్రిడ్జి నిర్మాణం, కాళంగి నది వద్ద గ్రాయిన్ల నిర్మాణం, పులికాట్ సరస్సు నుండి ఉప్పునీరు పట్టణంలోకి చొచ్చుకురాకుండా శాశ్వత రక్షణ చర్యలు, కొరిడి–పెర్నాడు రోడ్డు, వేనాడు రోడ్డు విస్తరణ వంటి కీలక మౌలిక వసతుల పనులపై ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ వివరంగా ప్రస్తావించారు. ఈ పనులకు అవసరమైన నిధులను తక్షణమే మంజూరు చేసి త్వరితగతిన పనులు ప్రారంభించేలా చూడాలని ముఖ్యమంత్రిని ఆమె కోరారు.
మహిళా ప్రజాప్రతినిధిగా నియోజకవర్గ ప్రజల క్షేమం కోసం క్షేత్రస్థాయిలో నిరంతరం కష్టపడుతున్న డాక్టర్ నెలవల విజయశ్రీ, ఈ కీలక మౌలిక వసతుల ప్రాధాన్యతను ముఖ్యమంత్రికి స్పష్టంగా వివరించారు. కాళంగి నది వద్ద నూతన వారధి నిర్మాణంతో పాటు రాతి గ్రాయిన్లు ఏర్పాటు చేస్తే తీరకోత సమస్యను సమర్థవంతంగా నియంత్రించవచ్చని ఆమె తెలియజేశారు.
పులికాట్ సరస్సు నుంచి ఉప్పునీరు పట్టణ ప్రాంతంలోకి చొచ్చుకుపోవడం వల్ల తాగునీరు కలుషితమవడమే కాకుండా భూగర్భ జలాలు దెబ్బతింటున్నాయని, ఈ సమస్యను అరికట్టేందుకు శాశ్వత రక్షణ చర్యలు అత్యవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వీటితో పాటు కొరిడి–పెర్నాడు మరియు వేనాడు మార్గాల ఆధునీకరణతో గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు గణనీయంగా మెరుగుపడతాయని ఆమె వివరించారు.
నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ చూపిస్తున్న నిరంతర తపనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఆమె వినతులపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి, అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేసి ఈ అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రజా సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ కృషి ఫలితంగా నియోజకవర్గానికి కీలక మౌలిక వసతుల పనులు వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె ప్రయత్నాలకు ప్రభుత్వం స్పందించడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.













