రాయలసీమ న్యూస్, తిరుపతి: తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని స్వర్ణముఖి నదిలో క్షుద్ర పూజలు నిర్వహించారన్న సోషల్ మీడియా ప్రచారంలో వాస్తవం లేదని నాయుడుపేట పోలీసులు స్పష్టం చేశారు. ఆన్‌లైన్ వేదికల్లో వైరల్ అవుతున్న ఈ కథనంపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి వివరాలు వెల్లడించారు.
నాయుడుపేట బీడీ కాలనీ సమీపంలోని స్వర్ణముఖి నదిలో ఆగస్టు 17వ తేదీ రాత్రి సుమారు 10 గంటల సమయంలో క్షుద్ర పూజలు జరిగాయంటూ కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రచారం ప్రారంభమైంది. ఈ పోస్టులు ప్రజల్లో ఆందోళన కలిగించేలా ఉండటంతో, విషయం పోలీసుల దృష్టికి వచ్చి, వెంటనే విచారణకు ఆదేశించారు.
పోలీసుల దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం, చెన్నై రెడ్‌హిల్స్ ప్రాంతానికి చెందిన చిన్నదొరై గణశేఖర్ (వయస్సు సుమారు 60 సంవత్సరాలు) కొంతకాలంగా కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో పాటు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆయన భార్య పద్మావతికి నాయుడుపేట ప్రాంతంలో బంధువులు ఉండటంతో, భర్త అనారోగ్యం తగ్గుతుందనే మూఢనమ్మకంతో వారి సూచన మేరకు నాయుడుపేట అగ్రహారం ప్రాంతానికి చెందిన కటకం ముత్యాలయ్యను సంప్రదించినట్లు విచారణలో తేలింది.
కటకం ముత్యాలయ్య సూచనలతో స్వర్ణముఖి నది వద్ద దిష్టి పూజ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దిష్టి తీసే సమయంలో ఒక బొమ్మ లేదా ఆకారం గీసి పూజా కార్యక్రమం చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. అయితే, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా అక్కడ క్షుద్ర పూజలు నిర్వహించారన్న ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు పోలీసులకు లభించలేదని అధికారులు తెలిపారు.
పూజా కార్యక్రమం అనంతరం చిన్నదొరై గణశేఖర్ అస్వస్థతకు గురయ్యాడన్న ప్రచారంపై కూడా పోలీసులు ప్రత్యేకంగా విచారణ చేపట్టారు. ఆయనకు ముందుగానే కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలు ఉన్నాయని, ఆరోగ్య పరిస్థితి కారణంగానే అస్వస్థతకు గురయ్యాడని, దీనిని క్షుద్ర పూజలతో ముడిపెట్టడం వాస్తవ పరిస్థితులకు విరుద్ధమని పోలీసులు స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో నిర్ధారణ లేని సమాచారం, వదంతులను నమ్మి ఆందోళన చెందవద్దని ప్రజలకు పోలీసులు సూచించారు. సున్నితమైన అంశాలకు సంబంధించిన విషయాలను ప్రచురించే ముందు వాస్తవాలను సమగ్రంగా నిర్ధారించుకోవాలని మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేశారు. అసత్య ప్రచారంతో ప్రజల్లో భయం, అపోహలు వ్యాపించే అవకాశం ఉండటంతో, ఇలాంటి సందర్భాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసు అధికారులు పేర్కొన్నారు.













