రాయలసీమ న్యూస్, తిరుపతి: రేణిగుంట పట్టణంలో వైభవంగా కొనసాగుతున్న శ్రీ గంగమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో తుడా ఛైర్మన్, TTD ఎక్స్‌అఫిషియో సభ్యుడు, TDP తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు స్థానిక యువత, నాయకులు, భక్తులు బాణసంచాతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, పూలు, పండ్లతో కూడిన ప్రత్యేక సారెను సమర్పించారు. మొక్కులు చెల్లించుకుని అమ్మవారి దర్శనం పొందారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు కోరుకున్నారు.
అమ్మవారి సేవలో ప్రత్యక్షంగా పాల్గొని సారె సమర్పించే భాగ్యం దక్కడం తన పూర్వజన్మ సుకృతమని డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో నియోజకవర్గ, జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.
ప్రతి ఏటా భక్తిశ్రద్ధలు, ఐకమత్యంతో గంగమ్మ జాతరను ఘనంగా నిర్వహిస్తున్న స్థానిక ప్రజలు, యువత, ఉత్సవ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. జాతర సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ కనిపించింది. అమ్మవారి సేవలో భాగంగా వివిధ వ్రతాలు, మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
జాతర మహోత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు, సేవలు, ఇతర ధార్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, TDP నాయకులు, కార్యకర్తలు, తెలుగు యువత ప్రతినిధులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు.













