తిరుపతి జిల్లా వెంకటగిరిలో కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి తన కుమారుడికి నిప్పంటించి, అనంతరం తానూ అగ్నికి ఆహుతైన దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనతో పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

వెంకటగిరి పోలీసుల కథనం ప్రకారం.. వెంకటగిరి పట్టణంలోని ఆత్మామాలిక్‌ ధ్యానమందిరంలో నాగేశ్వరశర్మ పూజారిగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య లీలాబాల శ్రావణి (35), కుమారుడు చంద్రమౌళి (9), ఏడేళ్ల కుమార్తె ఉన్నారు. కుటుంబంలో చిన్నచిన్న మనస్పర్థలు కొనసాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో శ్రావణి, కుమారుడు చంద్రమౌళిని ద్విచక్రవాహనంపై తీసుకొని సమీపంలోని కాశీతోటలో ఉన్న శివాలయం వద్దకు వెళ్లారు. ఆ ప్రాంతం నిర్మానుష్యంగా ఉండటంతో అక్కడే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

శ్రావణి ముందుగా కుమారుడిపై పెట్రోలు చల్లి, అనంతరం తనపైనా పోసుకొని నిప్పంటించుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. మంటలకు తాళలేక బాలుడు కేకలు వేస్తూ సమీపంలోని తుప్పల్లోకి పరుగులు తీశాడు. ఆ సమయంలో అక్కడ గుండా వెళ్తున్న ఆటో డ్రైవర్లు బాలుడి అరుపులు విని వెంటనే అక్కడికి చేరుకున్నారు.

బాలుడిని కాపాడేందుకు వారు ప్రయత్నించగా, అతడు తన తండ్రి నాగేశ్వరశర్మ ఫోన్‌ నంబరు చెప్పాడు. వెంటనే ఆటో డ్రైవర్లు నాగేశ్వరశర్మకు సమాచారమిచ్చారు. ఆయన అక్కడికి చేరుకునే సరికి శ్రావణి మంటల్లో కాలిపోయి ప్రాణాలు కోల్పోయింది.

తీవ్ర గాయాలపాలైన చంద్రమౌళిని నాగేశ్వరశర్మ తిరుపతిలోని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే మార్గమధ్యలోనే బాలుడు మృతి చెందాడు. దీంతో కుటుంబంలో శోకసంద్రం అలుముకుంది.

ఘటన సమయంలో శ్రావణి ఇంటి నుంచి బయటకు వస్తున్నప్పుడు కుమార్తె ఆడుకోవడానికి వెళ్లడంతో ఆమె ప్రాణాలతో బయటపడిందని స్థానికులు తెలిపారు. ఈ విషాద ఘటనతో ఆత్మామాలిక్‌ ధ్యానమందిరం పరిసర ప్రాంతం దిగ్భ్రాంతికి గురైంది.

సీఐ రోశయ్య, ఎస్సై స్వరూప సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. శ్రావణి ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది.