కడప జిల్లా బద్వేల్ పట్టణంలో గంజాయి అక్రమ రవాణా, విక్రయ శృంఖలాన్ని బద్వేల్ అర్బన్ పోలీసులు భగ్నం చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మైదుకూరు ఎస్డిపిఓ పర్యవేక్షణలో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా పోరుమామిళ్ల బైపాస్ ఫ్లైఓవర్ కింద 2.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో పాటు ముద్దాయిల వద్ద నుంచి 6 వేల రూపాయల నగదు, ఒక ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్‌ను కూడా పోలీసులు జప్తు చేశారు.

ఈ ఘటనలో ఐదు మంది నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు బద్వేల్ అర్బన్ పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన వారిలో దొడ్డేటిపల్లి రమణయ్య (ప్రకాశం జిల్లా), షేక్ చిన్న మురళి (నెల్లూరు జిల్లా), వలేరి మల్లికార్జున (ప్రకాశం జిల్లా), వల్లెపు వెంకటసుబ్బయ్య (మార్థోమ నగర్, బద్వేల్), నాగలూరి రాజమ్మ (ప్రకాశం జిల్లా) ఉన్నారు.

పోలీసుల సమాచారం ప్రకారం ప్రధాన నిందితుడు రమణయ్య తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి, ఇతర నిందితులకు కిలోకు 6 వేల రూపాయల చొప్పున విక్రయించేవాడు. బద్వేల్ పరిసర ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలను అడ్డాగా ఎంచుకుని, తన వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్ ద్వారా 250 గ్రాముల చొప్పున గంజాయిని విడివిడిగా ప్యాకెట్ల రూపంలో తయారు చేసి అమ్ముతున్న సమయంలో బద్వేల్ అర్బన్ పోలీసులు అతడిని, అతని తోడుదారులను పట్టుకున్నారు.

పట్టుబడ్డ ఐదుగురు ముద్దాయిలలో ఇద్దరు పాత నేరస్తులుగా ఉన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. గంజాయి, నగదు, వెయింగ్ మిషన్‌ను స్వాధీనం చేసి నిందితులను అరెస్టు చేసిన బద్వేల్ అర్బన్ సీఐ బి రామకృష్ణ, ఎస్సై జయ రాములు, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ, మైదుకూరు ఎస్డిపిఓ అభినందించారు.

బద్వేల్ పట్టణం, పరిసర ప్రాంతాల్లో గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయం, అక్రమ రవాణా వంటి కార్యకలాపాల్లో ఎవరైనా పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని, అవసరమైతే P. D Act నమోదు చేసి శిక్షించబడతారని బద్వేల్ అర్బన్ సీఐ రామకృష్ణ హెచ్చరించారు.