కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు సంక్లిష్టంగా మారుతున్నాయి. ఎవరి మాట వినాలి, ఎవరితో నడవాలనే సందిగ్ధంలో కార్యకర్తలు, స్థానిక నేతలు ఉన్నారు. ప్రధాన పార్టీలైన YCP, TDPల్లో వర్గపోరు తీవ్రరూపం దాల్చడంతో రెండు పార్టీలు నాలుగు వర్గాలుగా విడిపోయిన దృశ్యం కనిపిస్తోంది.

బద్వేల్‌లో YCPలో అంతర్గత విభేదాలు బహిర్గతమవుతున్నాయి. పార్టీకి చెందిన MLC గోవిందరెడ్డి, అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఉధృతమైంది. నియోజకవర్గంలో ఎవరి మాటకు ప్రాధాన్యం ఉండాలి, పార్టీ కార్యక్రమాలు ఎవరి ఆధ్వర్యంలో సాగాలి అన్న విషయంలో ఇరువర్గాలు తమ తమ బలాన్ని ప్రదర్శించుకుంటున్నాయని స్థానిక వర్గాలు చెబుతున్నాయి.

ఇక TDP పరిస్థితి కూడా పెద్దగా భిన్నంగా లేదు. పార్టీకి చెందిన మాజీ MLA విజయమ్మ, ప్రస్తుత ఇన్‌ఛార్జ్ సూర్యనారాయణ రెడ్డి అనుచరుల మధ్య విభేదాలు ముదిరాయి. నియోజకవర్గంలో పార్టీ పునాదులను బలోపేతం చేయాల్సిన సమయంలోనే అంతర్గత పోరు బయటపడటంతో కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు.

రెండు పార్టీల్లోనూ వర్గపోరు పెరగడంతో సాధారణ కార్యకర్తలు, స్థానిక నాయకులు ఎవరి వైపు నిలవాలనే దానిపై స్పష్టత లేక అయోమయంలో ఉన్నారు. ఒకే పార్టీకి చెందిన నాయకుల మధ్య విభేదాలు, పరస్పర ఆరోపణలు పెరగడంతో గ్రామస్థాయిలోనూ గుంపులు, గూటీలు ఏర్పడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక ప్రజలు మాత్రం తమకు అందుబాటులో ఉండే, ప్రజాబలం ఉన్న నాయకులకే ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. పార్టీ గుర్తు కంటే ప్రజల మధ్య కలిసిమెలిసి పనిచేసే నాయకులకే అవకాశం కల్పించాలని, అలాంటి వారినే ముందుకు తేవాలని ప్రజల డిమాండ్‌గా వ్యక్తమవుతోంది. బద్వేల్‌లో వర్గపోరు ఎటు మలుపు తిరుగుతుందో, పార్టీలు ఎలా సమన్వయం సాధిస్తాయో అన్నది ఆసక్తికరంగా మారింది.