రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప జిల్లా బద్వేలు పట్టణం పరిసర ప్రాంతాల్లో గ్రావెల్ మాఫియా దారులు మళ్లీ రెచ్చిపోతున్నారు. గతంలో సాయిబాబా గుడి సమీపంలో అక్రమంగా గ్రావెల్ తోలుతున్న విషయం వెలుగులోకి రావడంతో, సంబంధిత మాఫియా దారులు మార్గం మార్చి ఇప్పుడు అబుసాయిపేట సమీపంలోని సర్వే నెంబర్ 1 ప్రాంతాన్ని ఆశ్రయించినట్లు స్థానికులు చెబుతున్నారు.
రాత్రి వేళల్లో ఆ ప్రాంతంలో విచ్చలవిడిగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని, అధికార నాయకుల పేర్లు చెప్పుకుంటూ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనుమతి ఇచ్చిందని చెప్పుకుంటూ మట్టి మాఫియా దారులు దందా కొనసాగిస్తున్నారని సమాచారం. అధికారుల కళ్లకు గంతలు కట్టి, నియమ నిబంధనలను పక్కన పెట్టి జరుగుతున్న ఈ అక్రమ తవ్వకాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై బద్వేల్ ఎమ్మార్వో తిరుమల బాబు నుంచి వివరణ కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మట్టి, గ్రావెల్ తవ్వకాలకు సంబంధించి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. అధికారుల పేర్లు చెప్పుకొని అక్రమ తవ్వకాలకు పాల్పడితే సంబంధితులపై కఠిన చర్యలు తప్పవని ఎమ్మార్వో హెచ్చరించినట్లు తెలుస్తోంది.
బద్వేల్ పట్టణ పరిసర ప్రాంతాల్లో కొన్నిచోట్ల వ్యవసాయ భూముల్లో వెంచర్లు వేసి సొమ్ము చేసుకుంటున్నారని కూడా ఆయన దృష్టికి వచ్చినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. పర్మిషన్లు లేకుండా ఎలాంటి వెంచర్లు పెట్టినా, ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టాలని ప్రయత్నించినా, సంబంధితులపై కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని ఎమ్మార్వో స్పష్టం చేసినట్లు సమాచారం.
గ్రావెల్, మట్టి తవ్వకాలపై నియంత్రణ కోసం రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే మీడియా ద్వారా అక్రమ తవ్వకాల వివరాలు బయటపడిన నేపథ్యంలో, ఈసారి మాఫియా దారులపై అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.













