బ్రహ్మంగారిమఠం మండలం లింగాలదిన్నెపల్లె గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన భూములను ఆక్రమించాలనే ప్రయత్నాలు తగవని, వెంటనే ఆ ఆలోచనను విరమించుకోవాలని భూ ఆక్రమణదారులను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి. శివకుమార్ హెచ్చరించారు. ఎస్టీ, బిసిలకు కేటాయించిన భూముల్లోకి ప్రవేశించి పరిస్థితులను పరిశీలించిన అనంతరం ఆయన ఈ హెచ్చరికను చేశారు.

బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం బ్రహ్మంగారిమఠం మండల కమిటీ ఆధ్వర్యంలో పలుగురాళ్లపల్లె రెవిన్యూ పొలంలోని 1938 సర్వే నంబర్‌లో ఎస్టీ, బిసిలకు చెందిన భూముల్లో పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు జి. శివకుమార్, మండల కార్యదర్శి సాన గోవిందస్వామి, లింగాలదిన్నెపల్లె ఎస్టీ కాలనీకి చెందిన వారితో కలిసి భూముల పరిస్థితిని సమీక్షించారు.

వారు తెలిపిన వివరాల ప్రకారం, 2007వ సంవత్సరంలో అసైన్మెంట్ కమిటీ సమావేశంలో అప్పటి ప్రభుత్వం లింగాలదిన్నెపల్లె గ్రామంలోని ఏరుకుల, యానాది, పిచ్చిగుంట్ల, ముత్తరాసు, బెస్త కులాలకు చెందిన 94 మందికి ఎకరా చొప్పున డికెటి పట్టాలు మంజూరు చేసింది. అనంతరం భూములను సర్వే చేసి హద్దులు చూపించగా, అప్పటి నుండి ఆ భూముల్లో కంది, ఉలవ, ఆముదం వంటి పంటలు పండించుకుంటూ సంబంధిత కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని వారు వివరించారు.

గత నాలుగేళ్లుగా భూమి పక్క గ్రామానికి చెందిన కొంతమంది అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు పేదలను వారి భూముల్లోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని, ఈ విషయంపై పలుమార్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసినప్పటికీ రాజకీయ పలుకుబడి కారణంగా వారు తప్పించుకుంటున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇక్కడ సోలార్ కంపెనీకి అనుమతి మంజూరు అయిన తర్వాత నుంచే పేదలను బెదిరించడం మరింత పెరిగిందని, పేదల భూములను లాక్కొని సోలార్ కంపెనీకి అమ్ముకునే ఉద్దేశంతోనే ఈ చర్యలు జరుగుతున్నాయనే ఆరోపణలు బాధితులు చేశారు. ఇటువంటి భూకబ్జాదారులకు రాజకీయ పలుకుబడి కలిగిన కొందరు అండదండలు అందిస్తున్నందువల్లే వారు మరింత రెచ్చిపోతున్నారని కూడా వారు ఆరోపించారు.

పేదలకు చెందిన భూములను దౌర్జన్యంగా, దుర్మార్గంగా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే సహించబోమని, చట్టపరంగా ముందుకు వెళ్లి పోరాటం కొనసాగిస్తామని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు హెచ్చరించారు.

ఈ పర్యటనలో నాయకులు మల్లికార్జున, అజయ్ కుమార్, గ్రామ ప్రజలు ఆంజనేయులు, బ్రహ్మయ్య, రామాంజనేయులు, వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.