రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ఎర్రగుంట్ల: మద్యం సేవించి వాహనాలు నడిపిన 10 మందికి కోర్టు మొత్తం లక్ష రూపాయల జరిమానా విధించినట్లు ఎర్రగుంట్ల అర్బన్ సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు. అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన 10 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో నిందితులను కమలాపురం JFCM కోర్టులో హాజరుపరిచినట్లు ఆయన వివరించారు.
ప్రతి కేసులో ఒక్కో నిందితుడికి 10 వేల రూపాయల చొప్పున జరిమానా విధించడంతో మొత్తం జరిమానా మొత్తం ఒక లక్ష రూపాయలకు చేరిందని సీఐ తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై కోర్టు కఠినంగా వ్యవహరిస్తోందని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ఇలాంటి చర్యలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, నిరపరాధుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడుతుందని సీఐ విశ్వనాథరెడ్డి హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.
వాహనదారులు బాధ్యతగా వ్యవహరించాలని, మద్యం సేవించినపుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపకూడదని సీఐ సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యతగా భావించాలని, కుటుంబ సభ్యుల ప్రాణాలు, ఇతరుల భద్రత దృష్ట్యా డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి నిర్లక్ష్యపు చర్యలకు దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.













