జమ్మలమడుగు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి: చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి

జమ్మలమడుగు: జమ్మలమడుగు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా మార్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు టిడిపి వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం జమ్మలమడుగు మండలం గూడెంచెరువు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా భూపేష్ రెడ్డి స్వయంగా గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు తెలియజేశారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాలపై సమాచారం కలిగిన కరపత్రాలను పంపిణీ చేశారు.

యువత ఉపాధి, పరిశ్రమల స్థాపనపై దృష్టి సారించినట్లు భూపేష్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా, ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు ప్రాధాన్యతనిస్తూ, స్థానిక స్థాయిలోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు.

ప్రాంతంలో ఏర్పాటు కాబోతున్న సోలార్ ప్రాజెక్టులు, స్టీల్ ప్లాంట్, సిమెంట్ ఫ్యాక్టరీల వల్ల వందలాది మంది స్థానిక యువతకు ఉపాధి లభించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ప్రజల పూర్తి సహకారంతో జమ్మలమడుగు నియోజకవర్గాన్ని రాయలసీమలోనే ముందంజలో నిలిపేందుకు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో కలిసి తాను నిరంతరం శ్రమిస్తున్నట్లు భూపేష్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు ప్రతి అర్హుడికి చేరాలన్నదే తమ లక్ష్యమని భూపేష్ రెడ్డి స్పష్టం చేశారు. అర్హులైన లబ్ధిదారుల్లో ఎవరికైనా సంక్షేమ పథకాలు అందకపోతే, ఆ విషయాన్ని వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని గ్రామస్తులకు సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు జంబాపురం రమణారెడ్డి, టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు పాల్గొన్నారు. వీరితో పాటు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లికార్జున, స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.