రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: జమ్మలమడుగు : పెద్దముడియం మండలంలోని కుందూ నదికి ఎట్టకేలకు జలకళ సంతరించుకుంది. గత కొంతకాలంగా ఎల్ నినో ప్రభావంతో వాగులు, వంకలు, నదులు ఎండిపోవడంతో మండలంలోని కుందూ నది పూర్తిగా జీవకళ కోల్పోయిన పరిస్థితి నెలకొంది. నదిలో నీరు లేకపోవడంతో పరివాహక ప్రాంతాల్లోని రైతాంగం తీవ్ర ఆందోళనకు గురైంది.
ఇలాంటి సమయంలో తాజాగా శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయడంతో కుందూ నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం పెద్దముడియం, పాలూరు, చిన్నముడియం, ఉప్పులూరు, బలపనగూడూరు, గరిశలూరు, నెమళ్లదిన్నె గ్రామాల మీదుగా సుమారు 10 కిలోమీటర్ల మేర కుందూ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదిలో నీటి ప్రవాహం పెరగడంతో పరిసర ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది.
ఈ నీటి ప్రవాహం కారణంగా కుందూ పరివాహక ప్రాంతాల్లోని వ్యవసాయ బోర్లలో భూగర్భ జలమట్టం పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. నదిలో నీరు నిలకడగా ఉండి, ప్రవాహం కొనసాగితే బోర్లలో నీరు చేరి, సాగునీటి సమస్య కొంతవరకు తీరే అవకాశం ఉన్నదని వారు సూచిస్తున్నారు.
ప్రస్తుతం పరివాహక ప్రాంత రైతులు వరి, మినుము, మొక్కజొన్న తదితర పంటలను సాగు చేస్తున్నారు. నదిలో నీటి ప్రవాహం ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో మరిన్ని పంటలు సాగు చేసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. నీటి లభ్యత పెరగడం వల్ల పంటల విస్తీర్ణం పెరగడంతో పాటు దిగుబడులు కూడా మెరుగుపడతాయని వారు పేర్కొన్నారు.
కుందూ నదికి జలకళ రావడంతో స్థానిక రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నది ఒడ్డు ప్రాంతాల్లోని రైతులు గుంపులుగా చేరి నదిని వీక్షిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా ఎండలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు ప్రస్తుతం నదిలో ప్రవహిస్తున్న నీరు కొత్త ఆశలు నింపుతోంది.
శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి విడుదలైన నీటితో కుందూ నది మళ్లీ ఉద్ధృతంగా ప్రవహించడం, పరివాహక ప్రాంతాల్లో భూగర్భ జలాల పరిస్థితి మెరుగుపడే సూచనలు కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నీటి ప్రవాహం కొనసాగితే రాబోయే రబీ సీజన్‌లో కూడా రైతులు ధైర్యంగా పంటలు వేసే అవకాశం ఉందని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు.













