రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ఎర్రగుంట్ల: మాదకద్రవ్యాలు, వ్యసనాల నుంచి దూరంగా ఉండి విద్యార్థులు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు సూచించారు. పొట్లదుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం ‘నశాముక్త్ భారత్ అభియాన్’ (వ్యసన ముక్త భారత ప్రచారం) కార్యక్రమాన్ని నిర్వహించారు.
దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యసనాల దుష్పరిణామాలపై వివరణ ఇచ్చి, మంచి అలవాట్లను పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని నిర్వాహకులు వివరించారు.
ఈ సందర్భంగా బ్రహ్మకుమారీస్ (బీకే) ప్రతినిధి శాంత మాట్లాడుతూ, వికసిత్ భారత్ లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఈ నెల 20వ తేదీ వరకు ‘నశాముక్త్ భారత్’ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేటి యువతను వివిధ రకాల వ్యసనాల నుంచి దూరం ఉంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు.
అనంతరం బీకే సౌజన్య ఆధ్వర్యంలో విద్యార్థులందరితో ‘వ్యసన రహిత భారత్’ కోసం ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులలో స్వీయ క్రమశిక్షణ, మనోస్థైర్యం పెంపొందేలా అందరితో రాజయోగ ధ్యానం నిర్వహించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. మురళీకృష్ణ మాట్లాడుతూ, విద్యార్థులు మత్తు పదార్థాలకు, ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉన్నప్పుడే తమ జీవిత ఆశయాలను, లక్ష్యాలను సాధించగలరని తెలిపారు. తద్వారా సమాజ అభివృద్ధికి కూడా తోడ్పడతారని పేర్కొన్నారు.
రాజయోగ ట్రైనర్ వాసు మాట్లాడుతూ, నేటి కాలంలో విద్యార్థులు సెల్ ఫోన్, టీవీ వంటి వాటికి అతిగా అలవాటు పడకుండా జాగ్రత్త వహించాలని, చెడు స్నేహాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు.
కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఓంశాంతి (బ్రహ్మకుమారీస్) సభ్యులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిర్వాహకులు విద్యార్థులకు వ్యసనాల నుంచి దూరంగా ఉండేలా, సానుకూల ఆలోచనలతో ముందుకు సాగేందుకు ప్రోత్సాహం కల్పించారు.













