రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: వై.ఎస్.ఆర్. కడప జిల్లాలోని యర్రగుంట్ల పట్టణంలో పోలీసు శాఖ విస్తృత స్థాయిలో మెగా CASO ఆపరేషన్ నిర్వహించింది. జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు జమ్మలమడుగు ఎస్.డి.పి.ఓ శ్రీ వెంకటేశ్వర రావు పర్యవేక్షణలో ఈ ప్రత్యేక ఆపరేషన్ శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు కొనసాగింది.
పట్టణంలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాలకు అడ్డుకట్ట వేయడం, అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని పోలీసులు చేపట్టారు. ఇందుకోసం పోలీసు సిబ్బందిని 14 ప్రత్యేక బృందాలుగా విభజించి, యర్రగుంట్ల పట్టణంలోని 14 ప్రాంతాల్లో ఏకకాలంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు.

ఆపరేషన్ ప్రారంభానికి ముందు ఎస్.డి.పి.ఓ వెంకటేశ్వర రావు 14 బృందాల సిబ్బందికి విధుల కేటాయింపు, తనిఖీల విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చట్టపరమైన ప్రక్రియలపై సమగ్ర దిశానిర్దేశం చేశారు. ప్రతి బృందం తమకు కేటాయించిన ప్రాంతంలో ముందస్తు ప్రణాళిక ప్రకారం తనిఖీలు చేపట్టింది.
ఈ మెగా CASO ఆపరేషన్‌లో భాగంగా మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ‘శక్తి’ యాప్ డౌన్‌లోడ్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టి తనిఖీలు నిర్వహించారు. వాహనాల తనిఖీలు, ఈ-చలాన్ల పరిశీలన చేసి, నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. అవసరమైన చోట్ల వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకున్నారు. అనుమానాస్పద ఇళ్లు, ప్రాంతాల్లో తనిఖీలు చేసి, రౌడీషీటర్లు, అనుమానితులు, పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై తనిఖీలు జరిపి, పెట్టీ షాపులు, బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించారు.
పట్టణంలోని ప్రధాన ప్రాంతాలు, రద్దీ ప్రదేశాలు, అనుమానాస్పద ప్రాంతాల్లో విజిబుల్ పోలీసింగ్‌ను పెంచుతూ విస్తృతంగా తనిఖీలు కొనసాగించారు. మహిళల భద్రత, సంబంధిత చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, నిబంధనలు పాటించేలా సూచనలు చేశారు.
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచి, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఇటువంటి మెగా CASO ఆపరేషన్‌ల ద్వారా పట్టణంలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు మరింత బలపడుతుందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.













