రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలకు సంబంధించి అంకురార్పణను నేడు ఆగమోక్త విధానాలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ పునరుద్ధరణ అనంతరం నిర్వహించే ఈ మహాసంప్రోక్షణకు నాలుగు రోజులపాటు వైదిక కార్యక్రమాలు జరగనున్నాయి.
ఆగస్టు 23న సాయంత్రం 5.30 గంటల నుంచి 6 గంటల వరకు వాస్తుశాంతి, మృత్సంగ్రహణము, కుంభారాధన, అంకురార్పణ కార్యక్రమాలు జరుగనున్నాయి. ఆలయ పరిసరాల్లో యాగశాల, హోమగుండాల ఏర్పాట్లు పూర్తి కాగా, పురోహితులు, వేదపండితులు ఆగమ శాస్త్రోక్తంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
ఆగస్టు 24న ఉదయం 8 గంటలకు మనోన్మాన ప్రమాణ శాంతి హోమము, కుంభస్థాపన, పంచాగ్ని ప్రణయనము, శాత్తుమొర నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 6.30 గంటలకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి. భక్తులు ఈ హోమాలలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని ఆలయ వర్గాలు సూచిస్తున్నాయి.
ఆగస్టు 25న ఉదయం 7.30 గంటలకు చతుస్థానార్చన, ఏకశీతి కలశ స్నపనము, మూర్తి హోమము, అష్టబంధనం నిర్వహించనున్నారు. ఆలయ విగ్రహాలకు అష్టబంధన ప్రక్రియను ఆగమోక్తంగా చేపడతారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు శయ్యాధివాసం, తత్వ హోమాలు, శాంతి హోమం, శాత్తుమొర కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సందర్భంగా స్వామివారి ఆలయ ప్రాంగణం వేదఘోషలతో మారుమోగనుంది.
ఆగస్టు 26న ఉదయం 7 గంటలకు చతుస్థానార్చన, మూర్తి హోమము, ప్రాయశ్చిత్త హోమము నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 9.45 గంటల నుంచి 11.30 గంటల వరకు శ్రవణ నక్షత్రం, తులా లగ్నంలో మహా పూర్ణాహుతి, మహాసంప్రోక్షణ, కళాకర్షణ కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. మహాసంప్రోక్షణ అనంతరం ఆలయ గోపురాలు, విగ్రహాలకు తంత్రోక్త విధానాలతో తీర్థాభిషేకాలు చేయనున్నారు.
మహాసంప్రోక్షణ కార్యక్రమాలు పూర్తయిన అనంతరం ఆగస్టు 26వ తేదీ మధ్యాహ్నం నుంచి స్వామి, అమ్మవార్ల మూలవర్ల దర్శనానికి భక్తులను అనుమతించనున్నట్టు ఆలయ వర్గాలు తెలిపాయి. జీర్ణోద్ధారణ అనంతరం మొదటిసారి మూలవర్ల దర్శనం లభించబోతుండటంతో దేవుని కడప పరిసర ప్రాంతాల భక్తులు ఈ కార్యక్రమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













