కడప జిల్లాలో వ్యవసాయం, సూక్ష్మ, చిన్న పరిశ్రమలు, మహిళా సంఘాల ఉపాధి, ఆహార శుద్ధి రంగాలకు మరింత ప్రోత్సాహం అందించే దిశగా బ్యాంకులు, ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ శ్రీధర్ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని పిఆర్సి హాల్‌లో ఆయన అధ్యక్షతన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ (డిసిసి), డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ (డిఎల్ఆర్సి) బ్యాంకర్ల సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో జిల్లాలో బ్యాంకులు సాధించిన ప్రగతి, వివిధ ప్రభుత్వ పథకాల కింద లబ్ధిదారులకు రుణాల మంజూరు ప్రక్రియపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. అన్ని రంగాలకు నిర్దేశించిన రుణ లక్ష్యాలను నిర్ణీత గడువుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకు ప్రతినిధులకు సూచించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో మొత్తం రూ. 30,610 కోట్ల రుణ ప్రణాళికను నిర్దేశించినట్లు సమావేశంలో వెల్లడించారు. జూన్ 30 నాటికి రూ. 10,819.54 కోట్ల రుణాలు మంజూరు చేసి 35.34 శాతం ప్రగతి సాధించినట్లు తెలిపారు. ప్రాధాన్యత రంగానికి నిర్దేశించిన రూ. 23,744 కోట్లలో భాగంగా రూ. 7,518.41 కోట్లు, వ్యవసాయ రంగానికి లక్ష్యంగా పెట్టుకున్న రూ. 18,816 కోట్లలో రూ. 5,686.73 కోట్లు ఇప్పటివరకు రుణాలుగా విడుదలైనట్లు వివరించారు.

ఆహార శుద్ధి రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహారశుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం (PMFME) ద్వారా రైతులు, మహిళా సంఘాలకు ఈ రంగంలో ఉన్న అవకాశాలపై విస్తృత అవగాహన కల్పించాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. ఉద్యానవనశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల సమన్వయంతో ఆహార శుద్ధి పరిశ్రమలకు సంబంధించిన ప్రత్యేక అవగాహన శిబిరాలు నిర్వహించి, అర్హులైన వారికి ఈ పథకం ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల బ్యాంకు అనుసంధాన కార్యక్రమం పురోగతిని కూడా సమావేశంలో సమీక్షించారు. జిల్లాలో 11,485 సంఘాలకు రూ. 1,606.09 కోట్ల రుణ ప్రణాళికలు రూపొందించగా, ఇప్పటివరకు 4,976 సంఘాలకు రూ. 576.40 కోట్ల రుణాలు పంపిణీ చేసి 45.53 శాతం ప్రగతి నమోదు చేసినట్లు అధికారులు వివరించారు.

ప్రజల ఆరోగ్యం, విద్యార్థుల సంక్షేమం కోసం చేపడుతున్న స్మార్ట్ కిచెన్ కు కెనరా బ్యాంకు యాజమాన్యం రెండు ఫుడ్ బ్రౌజర్లను అందించడం అభినందనీయం

అని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. ఈ సామాజిక సేవా స్ఫూర్తికి కెనరా బ్యాంకు యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇతర బ్యాంకులు కూడా ప్రభుత్వ కార్యక్రమాలకు తోడ్పాటునందిస్తూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో ఎల్డీఎం లక్ష్మీ తులసి, కెనరా బ్యాంకు చీఫ్ మేనేజర్ జగన్నాథం, ఆర్‌బిఐ ఏజీఎం రాజ్ కుమార్, నాబార్డ్ డీడీఎం, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.