రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్ కల్పించినది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని, ఈ విషయాన్ని మాజీ మేయర్ పాక సురేష్ మరిచిపోయినట్లున్నారని ఫిషర్మెన్ కో-ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ ఛైర్మెన్ యాటగిరి రాంప్రసాద్ ఆరోపించారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేసి బీసీ రిజర్వేషన్ అంశంపై పాకా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు.
2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బీసీలకు ఉన్న రిజర్వేషన్‌ను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించారని, దీంతో దాదాపు 17 వేల మంది బీసీలు స్థానిక సంస్థల పదవులకు దూరం అయ్యారని రాంప్రసాద్ ఆరోపించారు. ఇది బీసీలపై చేసిన ద్రోహమని ఆయన వ్యాఖ్యానించారు.
1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్ టి ఆర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 20 శాతం రిజర్వేషన్ కల్పించారని, అనంతరం 1995లో చంద్రబాబు నాయుడు దాన్ని 34 శాతానికి పెంచిన విషయాన్ని పాక సురేష్ గుర్తు చేసుకోవాలని రాంప్రసాద్ సూచించారు. ఆ రిజర్వేషన్ సౌకర్యంతోనే పాక సురేష్ మేయర్ పదవిలోకి వచ్చారని, ఇది వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు.
1995 నుంచి 2018 వరకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కొనసాగిందని, అయితే 2019లో అది 24 శాతానికి ఎందుకు తగ్గిందో పాక సురేష్ మరియు ఆయన బృందం జగన్ మోహన్ రెడ్డిని అడిగి తెలుసుకోవాలని రాంప్రసాద్ అన్నారు. బీసీల వ్యతిరేకి జగన్, హైకోర్టు ఆదేశాల పేరుతో సుప్రీం కోర్టుకు వెళ్లకుండా 24 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయడం బీసీలకు ద్రోహం చేయడమేనని ఆయన మండిపడ్డారు.
మళ్లీ 34 శాతం రిజర్వేషన్ అమల్లోకి రావడంతో బీసీలు ఆనందంగా ఉన్న పరిస్థితిని జగన్ భరించలేకపోతున్నారని, అందుకే పాకా వంటి వ్యక్తులతో కలిసి చిక్కులు తెచ్చేందుకు కుట్రలు పన్నుతున్నట్లు పాకా వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోందని రాంప్రసాద్ ఆరోపించారు.
ఎన్ని కుట్రలు జరిగినా బీసీలు Telugu Desam Party పక్షానే నిలుస్తారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు Telugu Desam Partyకి ఏకపక్షంగా మారనున్నాయని తనకు ధీమా ఉందని రాంప్రసాద్ పేర్కొన్నారు.













