రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడపకు చెందిన షేక్ మహబూబ్‌హుస్సేన్ (51) రోడ్డు దాటుతున్న సమయంలో కారు ఢీకొనడంతో మృతి చెందిన ఘటన ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. ట్రాఫిక్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం శనివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది.
మహబూబ్‌హుస్సేన్ కడపలో నివసిస్తూ జిల్లాలోని దర్గాలు, మసీదులకు తరచూ వెళ్తుండేవాడని పోలీసులు తెలిపారు. అతనికి భార్యా పిల్లలు లేకపోవడంతో అన్మదమ్ముల వద్దనే ఉంటున్నాడని విచారణలో వెల్లడైంది.
శనివారం ఆర్టీసీ బస్సులో కడప నుంచి ప్రొద్దుటూరుకు వచ్చిన మహబూబ్‌హుస్సేన్ రాజీవ్ సర్కిల్ వద్ద రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఢీకొట్టిన ప్రభావంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ట్రాఫిక్ సీఐ భాస్కర్ తెలిపారు. కారు, డ్రైవర్ వివరాలను సేకరించి, ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.













