రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప నగర సమగ్రాభివృద్ధి, ఎన్నికల హామీల అమలు కోరుతూ కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (CPI) నగర సమితి ఆధ్వర్యంలో కడప మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ కార్యకర్తలు నినాదాలు చేశారు.
ఎన్నికల హామీల అమలులో భాగంగా కడప నగర సమగ్రాభివృద్ధికి రూ.5 వేల కోట్లు నిధులు కేటాయించాలని CPI నాయకులు డిమాండ్ చేశారు. నగర అభివృద్ధి పనులు, మౌలిక వసతులు, పేదవర్గాల సంక్షేమానికి ఈ నిధులు వినియోగించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.
ఇళ్ల లేని పేదలకు రెండు సెంట్ల ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని, కొత్త పింఛన్లు మంజూరు చేయాలని CPI సమితి కోరింది. ఆధార్ లేని పేద కుటుంబాలకు నెలకు రూ.1500 ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేసింది.
సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ (DWCRA) మహిళలకు రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని, చంద్రన్న బీమా పథకాన్ని తిరిగి అమలు చేయాలని, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అందించాలని CPI నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలని వారు స్పష్టం చేశారు.
కడప నగరంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, అనేక కాలనీల్లో తాగునీటి సరఫరా అంతరాయం అవుతోందని CPI నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు నిరంతర, నాణ్యమైన తాగునీటి సరఫరా ఉండేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ధర్నాలో CPI నాయకులు చంద్ర వెంకట శివ, మద్దిలేటి వేణుగోపాల్, బాదుల్లా వెంకటసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధర్నా సందర్భంగా కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వంపై నినాదాలు చేస్తూ, ఎన్నికల హామీల అమలు కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.













