రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్:
CSI బిషప్‌పై ఆరోపణలు, విచారణ కోరుతూ Synod కు ఫిర్యాదు
కడప: రాయలసీమ డయాసిస్‌కు చెందిన CSI బిషప్ పెయ్యల ఐజాక్ వరప్రసాద్ వ్యవహార శైలిపై పలు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ, ఆయనను బాధ్యతల నుంచి తప్పించి సమగ్ర విచారణ జరపాలని కోరుతూ CSI Synodకు ఫిర్యాదు చేసినట్లు సీనియర్ పాస్టర్ రెవరెండ్ ఐక్యత రావు తెలిపారు. ఈ నెల 19వ తేదీన చెన్నైలో CSI Synod Moderatorకు సమర్పించిన అప్పీల్‌లో తమ సస్పెన్షన్, మంత్రిత్వ బాధ్యతల నుంచి తొలగింపు, జీతాల నిలిపివేతతో పాటు CSI హైస్కూల్ స్థలాలకు సంబంధించిన లీజులు, భూ వ్యవహారాలు, కోర్టు ఆదేశాలు తదితర అంశాలను ప్రస్తావించినట్లు ఆయన పేర్కొన్నారు.
తమపై తీసుకున్న చర్యల్లో సరైన విధివిధానాలు పాటించలేదని అభ్యంతరం వ్యక్తం చేస్తూ Synodకు వినతిపత్రం సమర్పించినట్లు రెవరెండ్ ఐక్యత రావు వెల్లడించారు. తమ ఫిర్యాదుపై Synod నుంచి సానుకూల స్పందన లభించిందని, ఆరోపణలపై త్వరలో విచారణ జరిపి బిషప్‌పై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పాస్టర్లు తెలిపారు.
శనివారం కడప CSI హైస్కూల్ ప్రాంగణంలో జరుగుతున్న నిర్మాణాలపై పాస్టర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ ప్రధాన గేటుకు తాళం వేసి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగించడంతో పాటు, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సరఫరా చేసే వాహనం రావడానికి కూడా గేటు తీయకపోవడం దారుణమని వారు విమర్శించారు.
ఈ విషయం తెలుసుకున్న కడప మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర స్కూల్ గేటు వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రైవేట్ వ్యక్తులు స్కూల్‌కు సంబంధించిన ప్రధాన గేటుకు తాళం వేసి అక్కడి నుంచి వెళ్లిపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పాస్టర్లు తెలిపారు. స్కూల్ ప్రధాన గేటుకు ప్రైవేట్ వ్యక్తులు తాళం వేసే అధికారం ఎవరు ఇచ్చారని అడిషనల్ కమిషనర్ ప్రశ్నించినట్లు, ఈ ఘటనను పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సంబంధిత అధికారులకు నివేదిస్తామని ఆయన చెప్పినట్లు పాస్టర్లు వెల్లడించారు.
విద్యార్థుల రాకపోకలు, మధ్యాహ్న భోజనం సరఫరా వంటి పాఠశాల ప్రాథమిక కార్యకలాపాలకు ఆటంకం కలిగించే చర్యలు దారుణమని అడిషనల్ కమిషనర్ పేర్కొన్నట్లు పాస్టర్లు తెలిపారు. గేటు వద్దకు చేరుకున్న పాస్టర్లు బయట నుంచే నిరసన వ్యక్తం చేశారు. బ్యానర్లు ప్రదర్శిస్తూ CSI Synodకు సమర్పించిన వినతిపత్రాన్ని మీడియాకు చూపించారు. CSI హైస్కూల్ ప్రాంగణాన్ని విద్యా ప్రయోజనాలకే పరిమితం చేయాలని, విద్యార్థుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఎలాంటి వాణిజ్య నిర్మాణాలు చేపట్టకూడదని వారు డిమాండ్ చేశారు.
“అవినీతి, అక్రమాల బిషప్ మాకు వద్దు”
సీనియర్ పాస్టర్ ఐక్యత రావు మాట్లాడుతూ, నాగరాజుపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 262, 236లోని 1.26 ఎకరాలు, 2.71 ఎకరాల భూములకు సంబంధించి CSI Trust అనుమతి లేకుండా సబ్‌డివిజన్ కోసం దరఖాస్తు చేసినట్లు ఆరోపించారు. అధికారిక అనుమతులు, అధికార ప్రతినిధిత్వం, సంబంధిత రిజిస్ట్రేషన్ పత్రాల చెల్లుబాటుపై కూడా సమగ్ర విచారణ జరపాలని కోరారు.
అలాగే 2023లో డాక్యుమెంట్ నంబర్లు 1242, 1243, 1244, 1245గా పేర్కొన్న Mortgage/Settlement Deeds, అలాగే కడప మున్సిపల్ కార్పొరేషన్‌కు సమర్పించినట్లు చెబుతున్న కొన్ని పత్రాలపై కూడా అనుమానాలు ఉన్నాయని తెలిపారు. సర్వే నంబర్ 236-1లోని Door No.2/19-2-3కు సంబంధించిన పత్రాలు, 2024లో రిజిస్టర్డ్ Rental Deed నంబర్లు 8179, 8180 ద్వారా జరిగినట్లు పేర్కొంటున్న లావాదేవీలపై కూడా సమగ్ర విచారణ జరపాలని పాస్టర్లు డిమాండ్ చేశారు.
ఈ పత్రాల చెల్లుబాటు, భూ విభజన, నిర్మాణ అనుమతులు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలపై సంబంధిత Revenue, Registration, Municipal అధికారులు అధికారికంగా విచారణ జరిపి వాస్తవాలను తేల్చాలని వారు కోరారు.













