దాల్మియా పరిశ్రమ ప్రభావిత గ్రామాల ప్రజలకు ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నిబంధనల మేరకు అమలు చేసి, వారికి పూర్తి న్యాయం జరిగేలా చర్యలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ డా. శ్రీధర్‌ చెరుకూరి గారు సంబంధిత అధికారులను, దాల్మియా సంస్థ ప్రతినిధులను ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్‌ డా. శ్రీధర్‌ చెరుకూరి గారు, జాయింట్‌ కలెక్టర్‌ డా. నిధి మీనా గారితో కలిసి దాల్మియా సంస్థ యాజమాన్య ప్రతినిధులు, రెవెన్యూ, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. దాల్మియా పరిశ్రమ కార్యకలాపాల వల్ల ప్రభావితమైన గ్రామాల పరిస్థితి, అక్కడి ప్రజలకు ఇవ్వాల్సిన పరిహారం, పునరావాసం, అభివృద్ధి చర్యల అమలు స్థితిగతులపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.

గత ఏడాది నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ఇచ్చిన హామీలు, తీసుకున్న నిర్ణయాల అమలు పురోగతిని అంశాల వారీగా కలెక్టర్‌ సమీక్షించారు. ప్రతి హామీపై ఇప్పటివరకు చేపట్టిన చర్యలు, ఇంకా మిగిలి ఉన్న పనులపై సంబంధిత శాఖల అధికారులు వివరాలు సమర్పించారు. దాల్మియా సంస్థ యాజమాన్యం తరఫు ప్రతినిధులు కూడా తమ వంతు బాధ్యతల అమలు పరిస్థితిని సమావేశంలో వివరించారు.

ప్రభావిత గ్రామాల ప్రజలకు ఇవ్వాల్సిన భూ పరిహారం, గృహ నిర్మాణం, పునరావాస కాలనీల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ఉపాధి అవకాశాల సృష్టి వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. పరిహారం చెల్లింపుల్లో ఆలస్యం, పునరావాస పనుల్లో జాప్యం, అభివృద్ధి కార్యక్రమాల్లో నిదానగతి వంటి అంశాలపై కలెక్టర్‌ అధికారులు, సంస్థ ప్రతినిధుల నుంచి వివరణలు కోరారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ గారు మాట్లాడుతూ.. బాధిత ప్రజలకు అందాల్సిన పరిహారం, పునరావాస చర్యలు, అభివృద్ధి పనుల్లో జాప్యానికి తావులేకుండా సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు

దాల్మియా పరిశ్రమ కార్యకలాపాల ప్రభావం వల్ల నష్టపోయిన కుటుంబాలకు న్యాయం చేయడం ప్రభుత్వానికి, సంస్థకు సమాన బాధ్యత అని కలెక్టర్‌ సమావేశంలో పేర్కొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఏ విధమైన నిర్లక్ష్యం సహించబోమని అధికారులకు, సంస్థ ప్రతినిధులకు స్పష్టంగా తెలియజేశారు.

సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ డా. నిధి మీనా, రెవెన్యూ శాఖ అధికారులు, ఇతర సంబంధిత విభాగాల ప్రతినిధులు, దాల్మియా సంస్థ యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభావిత గ్రామాల సమస్యల పరిష్కారానికి సమయపట్టికతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, అమలు పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించాలని కలెక్టర్‌ సూచించారు.