కడప నగరంలో ప్రజా రహదారులపై ప్రమాదకరంగా బైక్ స్టంట్స్ నిర్వహిస్తూ ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న యువకులపై కడప ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ చర్యలపై పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ షెల్కె శరత్ విశ్వనాథ్ కడప ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

సోషల్ మీడియా ఆధారంగా స్టంట్స్‌కు పాల్పడుతున్న వారిని గుర్తించేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లలో లభించిన ఫోటోలు, వీడియోల ఆధారంగా సుమారు 50 మంది యువకులను విజయవంతంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల విచారణలో బైక్ ముందు చక్రాన్ని గాల్లోకి లేపడం (వీలింగ్), వెనుక చక్రాన్ని లేపడం (స్టాపీ) వంటి ప్రమాదకర స్టంట్స్‌తో పాటు, బైక్ సైలెన్సర్లను మార్చి పెద్ద శబ్దాలు చేయడం, మంటలు వచ్చేలా మార్పులు చేయడం వంటి విపరీత చర్యలకు వీరు పాల్పడుతున్నట్లు తేలింది.

యువకులకు స్టంట్స్‌లో శిక్షణ ఇస్తున్న పఠాన్ కిల్లర్ అబూబకర్, క్యాట్ ఇమ్రాన్, స్టంటర్ పండు, ఉమర్, అమ్మన్ (కడప), ఆసిఫ్ అలియాస్ పాండా (వేంపల్లి)లను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరి ద్వారా స్టంట్స్ నేర్చుకుని రహదారులపై ప్రదర్శనలు ఇస్తున్న యువకుల వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు.

అక్రమ స్టంట్స్‌కు ఉపయోగించిన సుమారు 40 మోటార్ సైకిళ్లను ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. సంబంధిత వాహనాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గుర్తించిన వారిలో 30 మంది మైనర్లు ఉండటంతో, వారి తల్లిదండ్రులను పిలిపించి ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రమాదకరమైన స్టంట్స్‌కు పాల్పడితే చట్టపరంగా అత్యంత కఠినమైన చర్యలు తప్పవని ఎస్పీ షెల్కె శరత్ విశ్వనాథ్ హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై, వారు నడుపుతున్న వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.

నగరంలో ఎక్కడైనా ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ ప్రజలను కోరారు. యువకులు తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే చర్యలకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని పోలీసులు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు.