కడప జిల్లా సుండుపల్లి మండలంలో గజరాజుల సంచారం కలకలం రేపుతోంది. ముడంపాడు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఏనుగుల మంద సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. డ్రోన్ కెమెరాల సహాయంతో తీసిన దృశ్యాల్లో మొత్తం 13 ఏనుగులు కనిపించగా, వాటిలో రెండు పిల్ల ఏనుగులు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.

సానిపాయ, భాకరాపేట రేంజ్‌లకు చెందిన అటవీశాఖ సిబ్బంది డ్రోన్ కెమెరాల ద్వారా ఏనుగుల కదలికలను పర్యవేక్షిస్తున్నారు. పిల్ల ఏనుగులు కూడా ఉన్నందున గుంపు మరింత ఆగ్రహంగా ప్రవర్తించే అవకాశం ఉందని భావించిన అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఏనుగులను మానవ నివాస ప్రాంతాలకు దూరంగా తరలించేందుకు బాణాసంచా పేల్చి అధిక శబ్దం చేసి వాటిని అటవీ లోతుల్లోకి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు.

ఏనుగుల మంద సంచరిస్తున్న ప్రాంతానికి సమీపంలో ఉన్న కటారిమడుగు, శివరాంపురం, నగరి, యానాది కాలనీ వంటి గ్రామాల ప్రజలకు అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. ఏనుగులున్న ప్రాంతాలకు వెళ్లకుండా, రాత్రి వేళల్లో పంట పొలాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే అటవీశాఖ, స్థానిక పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలని గ్రామస్థులకు తెలియజేశారు.

ఏనుగుల మంద సంచారం కారణంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజల్లో భయాందోళన నెలకొంది. ముఖ్యంగా రైతులు ఆందోళనకు గురవుతున్నారు. సుమారు పది రోజుల క్రితం సుండుపల్లి మండల సరిహద్దులోని ముడుంపాడు, దిన్నెల గ్రామాల పరిసరాల్లో ఏనుగుల మంద పంట పొలాల్లోకి ప్రవేశించి పంటలను ధ్వంసం చేసినట్లు, కొంత వ్యవసాయ పరికరాలను కూడా నాశనం చేసినట్లు స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు.

ఇటీవలి ఘటనలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ముడంపాడు అటవీ ప్రాంతంలో తిరుగుతున్న ఏనుగుల గుంపు మళ్లీ పంట పొలాలపై దాడి చేసే ప్రమాదం ఉందని రైతులు భయపడుతున్నారు. తమ పంటలను రక్షించుకోవడానికి రాత్రి వేళల్లో పొలాల వద్ద గస్తీ కాస్తున్నప్పటికీ, ఏనుగుల మందను ఎదుర్కోవడం కష్టమవుతోందని వారు చెబుతున్నారు.

కడప జిల్లా అటవీశాఖ అధికారులు పరిస్థితిని దగ్గర నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఏనుగుల కదలికలను నిరంతరం డ్రోన్ కెమెరాల ద్వారా గమనిస్తూ, అవసరమైతే అదనపు బృందాలను ముడంపాడు అటవీ ప్రాంతానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. గజరాజుల సంచారం పూర్తిగా తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలను పాటించాలని స్థానిక సంస్థలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి.