కడప: ఆధునిక యుగంలోనూ మూఢనమ్మకాలు, క్షుద్రపూజల పేరుతో అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడే ఘటనలు ఆగడం లేదు. కడప జిల్లాలో అలాంటి ఘోర యత్నాన్ని పోలీసులు సకాలంలో అడ్డుకున్నారు. ఓ బాలుడిని కిడ్నాప్ చేసి నరబలి ఇవ్వాలని ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసు వివరాలను కడప డీఎస్పీ బాలస్వామి రెడ్డి మీడియాకు తెలియజేశారు.

పోలీసుల కథనం ప్రకారం కాణిపాకం నివాసి విజయ్ కుమార్ , బాల హేమనాథ్ , బాల సుబ్రహ్మణ్యం అనే ముగ్గురు కలిసి ప్రణవ్ అనే బాలుడిని బలవంతంగా ఒక కారులో ఎక్కించారు. అనంతరం అతన్ని కడప జిల్లా వెల్లూరు ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడ క్షుద్రపూజల పేరిట బాలుడిని నగ్నంగా కూర్చోబెట్టి పూజలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.

తరువాత నరబలి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రణవ్ ను కడప ఎయిర్‌పోర్టు సమీపంలోని దట్టమైన కంఫచెట్ల ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడ కత్తితో బాలుడి గొంతు కోసి బలి ఇవ్వడానికి నిందితులు సిద్ధమయ్యారు. ప్రాణభయంతో ప్రణవ్ గట్టిగా కేకలు వేయడంతో పరిసరాల్లోని స్థానికులు అప్రమత్తమయ్యారు.

బాలుడి అరుపులు విని అక్కడికొచ్చిన స్థానికులను గమనించిన నిందితులు, ప్రణవ్ ను అక్కడే వదిలేసి పరారయ్యారు. స్థానికుల సహకారంతో బాధిత బాలుడిని వెల్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించి ఫిర్యాదు చేశారు. ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, తదుపరి విచారణ కోసం కేసును సంబంధిత పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.

వెల్లూరు మండలంలో తీవ్ర సంచలనం రేపిన ఈ బాలుడి హత్యాయత్నం కేసును పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టి, కేసును ఛేదించారు. ఈ దారుణానికి పాల్పడిన విజయ్ కుమార్ , బాల హేమనాథ్ , బాల సుబ్రహ్మణ్యం లను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ బాలస్వామి రెడ్డి తెలిపారు.

నిందితులు ఉపయోగించిన మారుతి సుజుకి Ciaz కారు, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు విచారణలో కీలక పాత్ర పోషించిన వెల్లూరు ఎస్‌ఐ R. శివ నాగిరెడ్డి , వారి సిబ్బందిని కడప ఎస్పీ నచికేత విశ్వనాధ్ ప్రత్యేకంగా అభినందించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు.

మూఢనమ్మకాలు, క్షుద్రపూజల పేరుతో అమాయకుల ప్రాణాలను బలిగొనాలనుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని, ఇలాంటి ఘటనలను ఏ మాత్రం సహించబోమని డీఎస్పీ హెచ్చరించినట్లు సమాచారం.