కడప JSW స్టీల్ ప్లాంట్‌తో రాయలసీమ ముఖచిత్రం మారనుంది :

ఎమ్మెల్యే కాలవ

రాయదుర్గం: రాయలసీమ అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు ఈ ప్రాంత భవిష్యత్తును పూర్తిగా మార్చేలా ఉన్నాయని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలోని తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

కడపలో JSW స్టీల్ ప్లాంట్ స్థాపనకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవడం రాయలసీమ పారిశ్రామిక ప్రగతిలో చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని కాలవ శ్రీనివాసులు తెలిపారు. రాయలసీమను పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు సాగుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

JSW స్టీల్ పరిశ్రమ ద్వారా వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ఎమ్మెల్యే వివరించారు. ఈ ప్లాంట్‌కు అనుబంధంగా అనేక పరిశ్రమలు కూడా పెద్దఎత్తున ఏర్పడి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు విస్తరించనున్నాయని చెప్పారు.

కేవలం కడప మాత్రమే కాకుండా మొత్తం రాయలసీమలో రూ. లక్ష కోట్ల విలువైన కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తోందని కాలవ శ్రీనివాసులు తెలిపారు. పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన ద్వారా పెట్టుబడులను ఆకర్షించే అనుకూల వాతావరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం సృష్టిస్తోందని ఆయన వివరించారు.

రాయలసీమపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న ప్రత్యేక శ్రద్ధ కారణంగానే ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న పారిశ్రామిక ప్రాజెక్టులు ఇప్పుడు కార్యరూపం దాలుస్తున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 2018లో తెలుగు దేశం పార్టీ ప్రభుత్వ కాలంలో కడప ఉక్కు పరిశ్రమకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

తరువాత YSRCP ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఈ పరిశ్రమపై ఏమాత్రం శ్రద్ధ చూపలేదని, కనీసం ప్రహరీ గోడ నిర్మాణ పనులు కూడా చేపట్టలేదని కాలవ శ్రీనివాసులు విమర్శించారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తిరిగి అధికారం చేపట్టిన తర్వాత ఈ ప్రాంత వాసుల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై కొత్త ఆశలు చిగురించాయని ఆయన వ్యాఖ్యానించారు.

రాయలసీమను కరువు, వలసల ప్రాంతంగా కాకుండా పారిశ్రామిక, ఆర్థిక శక్తిగా నిలబెట్టాలన్న దూరదృష్టితో ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని కాలవ శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో రాయలసీమకు సముచిత స్థానం కల్పించాలన్న చంద్రబాబు సంకల్పానికి ప్రజలంతా అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంఛార్జిలు పోరాళ్ల పురుషోత్తం, ఇనాయత్, మాజీ కౌన్సిలర్లు కడ్డీపుడి మహబూబ్ బాషా, బండి భారతి, కురుబ ప్రశాంతి, బుదురు తిప్పేస్వమి, డబ్బిడి శివ, ఆనంద్, కొండాపురం శ్రీనివాసులు, కరెన్న తదితరులు పాల్గొన్నారు.