రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్:
కడపలో "ఆపరేషన్ మోబీ ట్రాక్" ఘన విజయం –
రూ.12.67 కోట్ల విలువైన 6,487 మొబైల్స్ రికవరీ
కడప జిల్లా సైబర్ క్రైమ్ విభాగం చేపట్టిన "ఆపరేషన్ మోబీ ట్రాక్" ద్వారా భారీ స్థాయిలో మొబైల్ ఫోన్ల రికవరీ జరగింది. కేంద్ర ప్రభుత్వ CEIR (Central Equipment Identity Register) పోర్టల్, IMEI ట్రేసింగ్, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగిస్తూ ఈ ఆపరేషన్‌ను జిల్లా పోలీసులు విజయవంతంగా అమలు చేశారు.
ఇప్పటివరకు మొత్తం 9 విడతల్లో నిర్వహించిన రికవరీ ఆపరేషన్ల ద్వారా రూ.12,67,50,000 విలువైన 6,487 మొబైల్ ఫోన్లు తిరిగి బాధితులకు అందజేయబడ్డాయి. తాజా 9వ విడతలో మాత్రమే రూ.1,22,00,000 విలువైన 610 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి, వాటిని బాధితులకు అప్పగించారు. ఈ కార్యక్రమానికి కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాధ్, ఐపీఎస్ నేతృత్వం వహించారు.
కేంద్ర CEIR పోర్టల్‌లో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా, IMEI నంబర్లను ట్రేస్ చేసి, నెట్‌వర్క్ నిఘా, డేటా విశ్లేషణా పద్ధతుల ద్వారా మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేశారు. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు CEIR పోర్టల్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేయడంతో, వాటి ఆధారంగా IMEI ఆధారిత ట్రాకింగ్, డేటా అనలిటిక్స్ పద్ధతులు ఉపయోగించి ఫోన్లు త్వరితగతిన తిరిగి పొందేలా చర్యలు తీసుకున్నారు.
ఈ ఆపరేషన్ విజయవంతం కావడానికి అధునాతన డిజిటల్ టెక్నాలజీ, GPS ట్రాకింగ్, IMEI ట్రేసింగ్, మరియు సైబర్ నిఘా టూల్స్ వినియోగం కీలక పాత్ర పోషించాయి. మొబైల్ రికవరీ విషయంలో రాష్ట్ర స్థాయిలో కడప జిల్లా మంచి ప్రగతి సాధించింది.
సైబర్ మోసాల నుండి ప్రజలు రక్షణ పొందేందుకు పలు సూచనలు కూడా జిల్లా పోలీసులు వెల్లడించారు. అపరిచిత వీడియో కాల్స్, ఫిషింగ్ కాల్స్ లేదా ఇమెయిల్స్‌కు ప్రతిస్పందించకూడదని, సైబర్ నేరగాళ్ల మోసాలకు గురైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కు కాల్ చేయాలని, లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని, అలాగే NCRP (cybercrime.gov.in) వెబ్సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
మొబైల్ మిస్ అయినప్పుడు లేదా దొంగతనం జరిగినప్పుడు, మొబైల్‌తో లింక్ అయిన బ్యాంక్ ఖాతాల నెట్ బ్యాంకింగ్ సేవలను వెంటనే బ్లాక్ చేయించాలి. టెలికాం ఆపరేటర్‌ను సంప్రదించి SIM కార్డ్‌ను డిసేబుల్ చేయాలి. గూగుల్ పే , PhonePe వంటి UPI అప్లికేషన్లకు 2- ఫాక్టర్ Authentication లేదా బయోమెట్రిక్ సెక్యూరిటీ తప్పనిసరిగా అమలు చేయాలి. గూగుల్ / ఆపిల్ ID, వాట్సాప్ , ఈమెయిల్, సోషల్ మీడియా పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చాలి.
ఆండ్రాయిడ్ ఫోన్లకు ఫైండ్ మై డివైస్ , ఐఫోన్లకు ఫైండ్ మై ఐఫోన్ e (iCloud) ద్వారా ఫోన్‌ను లాక్ చేయడం, లేదా డేటాను రిమోట్‌గా డిలీట్ చేయడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. CEIR పోర్టల్ ceir.gov.in లో IMEI నంబర్ ద్వారా ఫిర్యాదు చేసి ఫోన్‌ను బ్లాక్ చేయడం కూడా అత్యంత అవసరమని పోలీసులు పేర్కొన్నారు.
సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనుగోలు చేసే సమయంలో ఒరిజినల్ బిల్లు, బాక్స్, అమ్మే వ్యక్తి ఐడెంటిటీని క్షుణ్ణంగా పరిశీలించాలని, అపరిచితుల నుండి ఫోన్లు కొనడం ద్వారా అవి దొంగిలించబడినవి లేదా సైబర్ నేరాలకు ఉపయోగించినవి అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
మొబైల్ ఫోన్ల రికవరీలో డిజిటల్ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించి ప్రతిభ కనబరిచిన సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ A. మధు మల్లేశ్వర రెడ్డి, అలాగే రికవరీ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన పోలీసు సిబ్బంది S. ఇస్రాయెల్ (HC 2814, ప్రొద్దుటూరు II టౌన్ PS), K.B.V. కృష్ణారెడ్డి (PC 924, జమ్మలమడుగు అర్బన్ PS), C. శివ శంకర్ రావు (PC 988, బద్వేల్ U/g PS), P. ఖాదర్ హుస్సేన్ (PC 2756, చిన్నచౌక్ U/g PS), N. చంద్రనారాయణ రెడ్డి (PC 2814, కడప I టౌన్ PS), T. వాసు (PC 3345, రాజంపేట అర్బన్ PS)లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ K. ప్రకాష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి N. సుధాకర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ T. రెడ్డెప్ప, జిల్లా PRO V. బాల సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.













