కడప: తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి లో జూలై 23 నుండి 30 వరకు నిర్వహించిన 11వ అఖిల భారత పోలీస్ గేమ్స్–2026లో కడప జిల్లా పోలీస్ సిబ్బంది విశేష ప్రతిభ కనబరచి జిల్లా పోలీస్ శాఖకు గర్వకారణంగా నిలిచారు. వివిధ క్రీడా విభాగాల్లో తమ ప్రతిభను చాటిన సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా ప్రొద్దుటూరు III టౌన్ పి.ఎస్ మహిళా కానిస్టేబుల్ పి. శివకుమారి, ప్రొద్దుటూరు II టౌన్ ఎస్.ఐ ఎస్. మహబూబ్ బాషా, ప్రొద్దుటూరు ట్రాఫిక్ పి.ఎస్ కానిస్టేబుల్ ఎస్.పి. మహబూబ్ బాషా లను ఎస్పీ సత్కరించి, వారి క్రీడా ప్రతిభను ప్రశంసించారు. కార్యక్రమంలో ఏ.ఆర్ అడిషనల్ ఎస్.పి శ్రీ బి. రమణయ్య, ఏ.ఆర్ డి.ఎస్.పి నాగేశ్వర రావు పాల్గొన్నారు.

జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ మాట్లాడుతూ, ఈ విజయం ద్వారా కడప జిల్లా పోలీస్ శాఖ, ముఖ్యంగా ప్రొద్దుటూరు పోలీస్ సబ్ డివిజన్ రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ఈ విజయాలు ఇతర పోలీస్ సిబ్బందికి ఆదర్శంగా నిలుస్తాయని, క్రీడల పట్ల ఆసక్తి, క్రమశిక్షణ, పట్టుదల పెంపొందించేందుకు ఇవి దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి పోలీస్ క్రీడా పోటీలలో వ్యక్తిగత విభాగంలో ప్రొద్దుటూరు III టౌన్ పి.ఎస్ (WPC-2186) మహిళా కానిస్టేబుల్ పి. శివకుమారి పెంచాక్ సిలాట్ క్రీడలో ఓపెన్ 2 ఓవర్ 100 Kg విభాగంలో రజత పతకం సాధించారు. ఈ విజయంతో కడప జిల్లా పోలీస్ శాఖకు ఆమె గర్వకారణంగా నిలిచారు.

అదేవిధంగా ప్రొద్దుటూరు II టౌన్ పి.ఎస్ ఎస్.ఐ ఎస్. మహబూబ్ బాషా, ప్రొద్దుటూరు ట్రాఫిక్ పి.ఎస్ (PC-2559) కానిస్టేబుల్ ఎస్.పి. మహబూబ్ బాషా తైక్వాండో క్రీడలో పూమ్సె విభాగంలో క్వార్టర్ ఫైనల్ వరకు చేరుకుని ప్రతిభ కనబరిచారు. జాతీయ స్థాయి పోటీల్లో క్వార్టర్ ఫైనల్ వరకు చేరుకోవడం ద్వారా వారు తమ క్రీడా నైపుణ్యాన్ని చాటడంతో పాటు జిల్లా పోలీస్ బలగాలకు మంచి పేరు తీసుకువచ్చారు.

జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ ఈ సందర్భంగా భవిష్యత్‌లో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో కూడా కడప జిల్లా పోలీస్ సిబ్బంది విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. క్రీడలతో శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం పెరుగుతాయని, పోలీస్ విధుల్లో మరింత సమర్థతకు ఇది తోడ్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.