కడప: జూనియర్ డాక్టర్లకు 25% స్టైఫండ్ పెంపు అమలు చేసే వరకు తమ సమ్మెను విరమించేది లేదని కడప రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS) జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. ఇప్పటికే 11వ రోజుకు చేరుకున్న నిరసన కార్యక్రమంలో భాగంగా శనివారం ఆసుపత్రి ప్రాంగణంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించి తమ ఆందోళనను కొనసాగించారు.

ప్రభుత్వం నుంచి స్టైఫండ్ పెంపుపై స్పష్టమైన హామీ రాకపోవడంతోనే సమ్మెను కొనసాగిస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, దీంతో సేవా కార్యక్రమాలతో పాటు నిరసనను కూడా కొనసాగించాల్సి వస్తోందని వారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ ప్రభుత్వ పెద్దలు వెంటనే స్పందించి జూనియర్ డాక్టర్లతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. అధికారులు 3 పర్సెంట్, 5 పర్సెంట్ స్టైఫండ్ పెంచుతామని ప్రెస్ నోట్ విడుదల చేయడం జరిగిందని, దానికి జూనియర్ డాక్టర్లు ఎటువంటి పరిస్థితులకు ఒప్పుకుంటే పరిస్థితి లేదన్నారు.

తాము డిమాండ్ చేస్తున్న విధంగా 20%, 25% స్టైఫండ్ పెంపు అమలు చేయాలని కోరారు. తమ ఆర్థిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, చిన్నచిన్న పెంపులతో సమస్యలు పరిష్కారం కావని జూనియర్ డాక్టర్లు అభిప్రాయపడ్డారు.

తమ డిమాండ్లను పూర్తిగా పరిష్కరించేంతవరకు సమ్మె ఆగదని, ఈ దిశగా ప్రభుత్వం తక్షణం చొరవ చూపాలని జూనియర్ డాక్టర్లు కోరారు. ఆరోగ్య సేవలు అంతరాయం కలగకుండా ఉండాలంటే ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించి, జూనియర్ డాక్టర్ల సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని వారు సూచించారు.